Loco pilots protested Along with family: రైళ్లు ప్రమాదాల బారిన పడకుండా రైల్వే శాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు విపరీతంగా పని భారాన్ని పెంచాయంటూ.. విజయవాడ డివిజన్ పరిధిలోని.. లోకో పైలట్లు ఆందోళన బాట పట్టారు. ఇటీవల ప్రవేశపెట్టిన జీరో సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్, స్పాడ్ వంటి విధానాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త విధానాల వల్ల ఒత్తిడి మరింత పెరిగి.. పనిపై దుష్ప్రభావం చూపుతోందని ఆవేదన చెందుతున్నారు. ఒకే సమయంలో పలు పనులు చేయాల్సి వస్తుండటం వల్ల ఆరోగ్య సమస్యలూ అధికమయ్యాయని వాపోతున్నారు.
కష్టపడి విధులు నిర్వర్తిస్తున్నా.. తమకు సరైన న్యాయం జరగడం లేదంటూ.. లోకోపైలట్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవుల విషయంలో అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండటం వల్ల.. కుటుంబపరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ వాపోయారు. అందుకే కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగామని తెలిపారు. విధి నిర్వహణలో.. ఆర్డర్లు, శిక్షలు, హెచ్చరికలు, సెమినార్లు, కౌన్సెలింగ్‌లు, చెకింగ్‌లను భరించలేకపోతున్నామని అన్నారు. ఆన్ డ్యూటీలోనే కాకుండా.. రన్నింగ్ రూమ్‌లోనూ ఫోన్ మాట్లాడకుండా కొత్తగా నిబంధన తీసుకురావడం పట్ల.. లోకో పైలట్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.