Sexual Harassment on Student: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సుధాకర్‌పై ఓ విద్యార్థిని లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. వైధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయింది. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు భర్త సాయంతో సమస్యను మీడియా దృష్టికి తీసుకొచ్చారు.
'నేను అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా దూరవిద్యాలో మూడో సంవత్సరం చదువుతున్నా. తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గణితం అధ్యాపకుడు సుధాకర్ కొంత కాలంగా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. విద్యార్థులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో నా ఫోన్ నంబర్ తీసుకొని మెసేజ్ చేసేవాడు. పరీక్షలు రాసేందుకు వెళ్లిన ప్రతీసారి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సదరు అద్యాపకుడిపై మరి కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా.. ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదు. నా భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నత విద్యా శాఖ కమిషనర్, రాజమండ్రి ఆర్జేడీ, మహిళా కమిషన్, అంబేడ్కర్ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. ప్రిన్సిపల్, అధ్యాపకుడికి మెమోలు జారీ చేశారు' అని ఆమె చెప్పింది.