Steel Plant: విశాఖ ఉక్కు కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు Visakhapatnam steel plant: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలని, అప్పటి వరకు పోరాటాలు కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై పోరాటం తీవ్రం చేసే కార్యాచరణలో భాగంగా మే 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పారు.
దీని ద్వారా కేంద్రానికి తమ నిరసన తెలియజేయాలని ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అందరూ కలిసి కట్టుగా ఆందోళనల ద్వారా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు.
32 మంది బలిదానంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని.. ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం.. విశాఖ ఉక్కు పరిశ్రమను తన మిత్రులైన అదానీ వంటి వ్యక్తులను అత్యంత చౌకగా కట్టబెట్టేందుకు చూస్తోందని.. ఈ చర్యలను రాష్ట్ర ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండి.. దీనిని వ్యతిరేకించాలని కోరారు.
ఆందోళనల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని.. మే 3వ తేదీన చేపట్టే ఆందోళనలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉద్యమానికి పూర్తి సహకారం అందించాలని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొండితనంతో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
"విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు మేరకు.. మే 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయడం ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాలని, అదే విధంగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి రాష్ట్రంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ, కార్మిక సంఘాలు కలసి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని.. ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతున్నాం.
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులకు, విదేశీ సంస్థలకు అత్యంత కారుచౌకగా అమ్మే విధానాల్ని వెనక్కి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదు. 32 మంది ప్రాణాలు బలిదానంతో సాధించుకున్న దీనిని అతి చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. తన మిత్రుడైన అదానీ లాంటి వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిని అందరూ వ్యతిరేకించాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి".- సాంబశివరావు, కార్మిక సంఘాల నేత
ఇవీ చదవండి: