MLC L Ramana for ED Investigation: క్యాసినో ఆడేందుకు ఎల్ రమణ విదేశాలకు వెళ్లినట్లు అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం రమణ హాజరయ్యారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అనంతపురానికి చెందిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరులు మహేష్‌యాదవ్, ధర్మేందర్ యాదవ్‌లను హైదరాబాద్ ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించారు.
కళ్లు తిరిగి నీరసంగా:ఈడీ కార్యాలయానికి వచ్చిన ఎల్ రమణ.. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల రమణ గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. విచారణ నిమిత్తం వచ్చిన ఆయన.. అక్కడి భవనంలో మూడో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ వినియోగించకుండా మెట్లు ఎక్కి వెళ్లారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన వెంటనే అధికారులను రమణ మంచినీరు అడిగినట్లు సమాచారం.
కళ్లు తిరిగి నీరసంగా అనిపించడంతో విషయాన్ని ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చాలా సేపటివరకు రమణ పరిస్థితి అలాగే ఉండడంతో అధికారులు స్పందించి హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు ఈడీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ నీరసంగా కనిపించడంతో క్యాసినోపై రమణను అధికారులు పెద్దగా ప్రశ్నించలేకపోయారని సమాచారం.
క్యాసినోల ముసుగులో విదేశాలకు నిధుల మళ్లిస్తున్నారన్న ఆరోపణలపై నాలుగు నెలల క్రితం ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి జూద ప్రియులను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తీసుకెళుతూ పెద్దమొత్తంలో నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పలువురు టూర్ ఆపరేటర్లపై గత జులైలో ఈడీ కేసు నమోదు చేసి పలువురిని విచారించింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో అప్పట్లో సోదాలు నిర్వహించి వారిని విచారించారు.
ఇవీ చదవండి: