Lakshmi Polyclinic and Diagnostic Centre opening: మారుమూల గ్రామాల్లో తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్సా విధానాన్ని అందించాలనే లక్ష్యంతో వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి మొవ్వా కృష్ణబాబు అన్నారు. విజయవాడలో స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్మీ ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో 'లక్ష్మీ పాలిక్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్'ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఆయన.. 104 ద్వారా ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, గ్రామాల రోగుల పరిశీలనకు మరో వైద్యుడిని నియమించడం జరిగిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంచే ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఐడీతో అనుసంధానం చేస్తే మెరుగైన వైద్యానికి సాకారం అవుతుందన్నారు. పేద ప్రజలకు రాయితీతో నాణ్యమైన వైద్యం అందించేందుకు ముందుకు వచ్చే ఎన్టీవో, ప్రజాసంబంధం కలిగిన సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఇదేవిధంగా వైద్య వృత్తితో సంబంధం ఉన్న ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా ఇలాంటి సేవా సంస్థలను ఏర్పాటు చేసి.. తక్కువ ఖర్చుతో పేదవారికి వైద్యం అందిస్తే బాగుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.