KRISHNA WATER DISPUTE రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పీసీసీ మాజీ అధ్యక్షులు శైలజానాథ్‌లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉత్తరం రాసి, ఊరుకున్నారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
CPI Ramakrishna Comments:విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఐ రామకృష్ణ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''జగన్ అతని స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో పునః పంపిణీ అంటే కచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం జరిగినట్టే. కేంద్ర క్యాబినెట్ నిర్ణయంపై సీఎం జగన్ ఉత్తరం రాసి ఊరుకున్నారే తప్ప.. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తున్నా, దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా.. చూస్తూ ఉండిపోయారు. రాష్ట్రంలో అన్ని రంగాలను నాశనం చేస్తున్నారు. తక్షణమే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని సంఘాలు పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.'' అని ఆయన అన్నారు.
MLA Gottipati Ravikumar Fire on CM Jagan: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి.. పునః సమీక్ష ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆపించాలని.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. అలా జరగనిపక్షంలో రాష్ట్రంలోని అన్నదాతలకు ఆర్తనాదాలేనని మిగులుతాయని అన్నారు. రాష్ట్రాన్ని భ్రష్ఠు పట్టించేంతవరకూ సీఎం జగన్.. నిద్రపోయేలా లేరంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రంతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాపై పగ బట్టినట్టు జగన్ వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. నాడు మౌనంగా ఉండి.. ఇప్పుడు లేఖలు రాస్తే ఏం ప్రయోజనమని నిలదీశారు. ఇప్పటికే పోలవరం నాశనం చేసిన జగన్ రెడ్డి.. గోదావరిజలాలను రైతులు వినియోగించుకోకుండా శాడిజం చూపించాడని ఆరోపించారు.