Kidney Problems In Ntr District: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేటలో చాప కింద నీరులా మూత్రపిండాల వ్యాధి విస్తరిస్తోంది. తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలంలోని గిరిజన తండాల్లో రెండు దశాబ్దాల్లో వందలాదిమంది చనిపోయారు. ఈ ఏడాదిలోనే ఆగస్టు నెల వరకు 35 మంది మృతి చెందగా, బతకాలనే ఆరాటంతో డయాలసిస్ చేయించుకుంటూ పదుల సంఖ్యలో మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రజాసంఘాలు తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేయగా, 15 మండలాల్లో కిడ్నీ బాధితులున్నట్లు బయటపడింది. 47 గ్రామాల్లో తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. బాధితులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని ఇచ్చిన వినతులకు అప్పటి ప్రభుత్వం స్పందించింది. రేషన్ దుకాణాల ద్వారా పోషకాహారం, ఉచితంగా మందులు, డయాలసిస్ కేంద్రాలకు వెళ్లేందుకు వాహనాలు సమకూర్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకునే రోగులకు పింఛన్లు మంజూరు చేసింది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు శుద్ధ జలాలు సరఫరా చేసింది. గడిచిన మూడేళ్లుగా వైకాపా ప్రభుత్వంలో బాధితులకు ఎలాంటి సాయమందడం లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు.
ఇద్దరిని పొగొట్టుకొని జీవచ్ఛవంలా:"కిడ్నీ వ్యాధి మా కుటుంబంపై పగబట్టింది. మా నాన్న పీర్యా 2007, నా భార్య చిలక 2020లో చనిపోయారు. నేనూ గత పదేళ్ల నుంచి మందులు వాడుతూ జీవచ్ఛవంలా ఉన్నా. నా పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇటీవల క్రియాటిన్ పెరగడంతో డయాలసిస్ చేయించుకుంటున్నా. మా ముగ్గురి చికిత్స కోసం ఉన్న భూమిని తెగనమ్ముకున్నాను. మరో రూ.4 లక్షల అప్పు ఉంది. ఇంట్లో నా కొడుకు ఒక్కడే కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డయాలసిస్ కోసం వారానికి రెండు సార్లు తిరువూరు వెళ్లి రావడానికి, నెలవారీ మందులకు చేతిలో చిల్లిగవ్వలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. పింఛనూ మంజూరు కాలేదు".-భూక్యా బాబ్జి, కిడ్నీ బాధితుడు, దీప్లానగర్, ఎ.కొండూరు
వార్డు సభ్యురాలినైనా సాయమేదీ?"రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా. క్రియాటిన్ ఎక్కువ కావడంతో రెండు నెలలుగా డయాలసిస్ మీద ఉన్నా. చికిత్సకు డబ్బుల్లేక వడ్డీకి అప్పు తెచ్చి ఖర్చు పెడుతున్నా. అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యురాలిగా ఉన్న నాకే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమందలేదు. మిగిలిన వారి పరిస్థితి ఎలాగుందో అర్థమవుతుంది. డయాలసిస్ మీద ఉన్నా నిబంధనల ప్రకారం నాకు అప్పుడు పింఛన్ మంజూరు కాదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అది చేస్తాం, ఇది చేస్తామన్నారు. రెండు నెలలుగా మంచం పట్టిన నన్ను పరామర్శించడానికీ ఎవరూ రాలేదు. నన్ను కాపాడుకునేందుకు భర్త, కొడుకు అష్టకష్టాలు పడుతున్నారు. చావలేక బతుకుతున్నా, చికిత్స నిమిత్తం ఇప్పటివరకు రూ.3 లక్షల వరకు అప్పులు చేశాం".-భరోతు జామక, దీప్లానగర్