Justice BVLN Chakraborty Law Classes: సాంకేతిక పరిజ్ఞానంపై న్యాయవాదులకు పట్టు అవసరమని, వయసుతో సంబంధం లేకుండా అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి అన్నారు. క్లిష్టమైన కేసుల్లో సాంకేతిక ఆధారాలే కేసు భవితను నిర్దేశిస్తాయని, ఈ నేపథ్యంలో ఐటీ చట్టంలోని సెక్షన్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. పలు సందర్భాలలో ఎలక్ట్రానిక్ సాక్ష్యాలే కేసును మలుపు తిప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయని వివరించారు.
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాదులకు ఆదివారం విజయవాడలో ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి న్యాయవాదులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంశంపై అవగాహన కల్పించారు. ఏదైనా నేరం జరిగినప్పుడు కీలకంగా మారుతున్న.. సీసీ కెమెరా దృశ్యాలు, సీడీఆర్, ఎలక్ట్రానిక్ రికార్డులు, సామాజిక మాధ్యమాలు, తదితర వాటిల్లో ఇమిడి ఉన్న అంశాలు, కేసులో వాటికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు.
నందిగామలో ఘనంగా న్యాయ సేవా దినోత్సవం - న్యాయమూర్తులు, న్యాయవాదుల ర్యాలీ
AP High Court Judge on Technology: ఈ సందర్భంగా వివిధ కోర్టులు వెలువరించిన తీర్పుల గురించి ప్రస్తావించారు. సేమ్ ప్రముఖులే చేశారన్న రీతిలో డీప్ ఫేక్ వీడియోలు ఇటీవలి కాలంలో విపరీతంగా హలచల్ చేస్తున్నాయని, ఇటువంటి కొత్త అంశాలను గురించి తెలుసుకుంటేనే వృత్తిపరంగా రాణించగలరన్నారు. అన్ని అంశాలపై మరింత అవగాహన పెంచుకుని ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగా ఉండే పేదలకు అత్యుత్తమ న్యాయ సేవలు అందించాలని కోరారు.