ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూతన సాంకేతికత పని పట్టు.. నీ జాబ్​ పోతే ఒట్టు.. - ఐటీ ఉద్యోగాలు

New Technical Skills : గతేడాది నుంచి మొదలైన ఐటీ ఉద్యోగుల తొలగింపు.. ఈ ఏడాది కూడా సాగుతోంది. ఆర్థిక మాంద్యం భయంతో ఎన్నో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఈ రంగంలో ఉద్యోగం నిలవాలంటే కొన్ని ప్రత్యేకమైన కోర్సులు నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. మరి ఆ కోర్సులు ఏంటో ఒకసారి చూద్దామా.

New Technical Skills
నూతన సాంకేతికత

By

Published : Jan 29, 2023, 12:55 PM IST

New Technical Skills : కొవిడ్‌ సమయంలో ఐటీ కంపెనీలు పోటీలు పడి మరీ కొత్త ఉద్యోగులను నియమించాయి. కానీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి. చిన్న, మధ్య స్థాయి కంపెనీల నుంచి దిగ్గజ కంపెనీల వరకూ ఇదే వరుస. ఈ పరిస్థితిని ఊహించని ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ముఖ్యంగా ఉద్యోగంపై భరోసాతో వేసుకున్న ఆర్థిక ప్రణాళికలు చిన్నాభిన్నమవుతున్నాయి. కొత్త ఉద్యోగం ఎప్పటికి దొరుకుతుందో అనే ఆందోళనతో సతమతమవుతున్నారు.

మన ఐటీ పరిశ్రమ, అమెరికా మీద అధికంగా ఆధారపడినందున, అక్కడి ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది. 2022 నవంబరు నుంచి ఇప్పటి వరకూ అమెరికాలో దాదాపు 2 లక్షల ఐటీ ఉద్యోగాలు పోయినట్లు అంచనా. మన దేశంలోనూ కంపెనీలు కొద్ది నెలలుగా ఐటీ ఉద్యోగాల్లో భారీగానే కోత పెడుతున్నాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుంది.. ఐటీ రంగంలో తాజాగా ఎటువంటి మార్పులు వస్తున్నాయి.. దానికి ఉద్యోగులు ఎలా సన్నద్ధం కావాలనేది ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

అంకురాల్లోనూ...మన దేశంలోని పలు అంకుర సంస్థలూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇంక్‌42.కామ్‌ నివేదిక ప్రకారం అంకుర సంస్థలు దాదాపు 18,000 మందిని తొలగించాయి. ఇందులో బైజూస్‌, ఓలా, బ్లింకిట్‌, అన్‌ అకాడమీ, వేదాంతు, వైట్‌హ్యాట్‌ జూనియర్‌ తదితరాలున్నాయి. ఒక్క బైజూస్‌లోనే 2,500 మంది ఉద్యోగులను తీసేశారు. ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ మనదేశంలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తామంటోంది.

ఎంత ప్రయత్నించినా లాగిన్‌ కాదు:మన దేశంలో ప్రస్తుత సీజన్లో ఐటీ రంగంలో 50,000కుపైగా ఉద్యోగాలు పోయి ఉంటాయని అంచనా. ఇది ఇంతటితో అయిపోలేదు. వచ్చే 6 నెలలు, ఏడాదిపాటు తొలగింపులుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఒక హెచ్‌ఆర్‌ రిక్రూటింగ్‌ సేవల సంస్థ అయితే మన దేశంలో ఇంకా లక్షకుపైగా ఐటీ ఉద్యోగాలు పోయే అవకాశముందని స్పష్టం చేస్తోంది. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల్లో కొందరు.. ఉదయాన తమ షిఫ్టు ప్రకారం ‘ల్యాప్‌ట్యాప్‌ తీసి లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తే అది పని చేయడానికి నిరాకరిస్తోంది.

ఏమైందని కంపెనీ హెచ్‌ఆర్‌ విభాగాన్ని సంప్రదిస్తే.. ‘మీ ఉద్యోగం పోయింది. మీకు రావాల్సిన సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. అన్ని వివరాలతో మెయిల్‌ పంపిస్తాం’ అనే సమాధానం వస్తోందట. ‘ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి ఐడీ కార్డు పంచ్‌ చేసినప్పుడు.. పచ్చ లైటు వెలిగితే ఉద్యోగం ఉన్నట్లు. ఎర్ర లైటు వెలిగితే ఐడీ కార్డు అక్కడ సెక్యూరిటీకి ఇచ్చేసి వెనుదిరిగి రావటమే’ అనే పద్ధతి అమెరికాలో నెలకొంది.

అసలు ఎందుకిలా?

  • ప్రపంచం మొత్తం దాదాపు రెండేళ్లపాటు కొవిడ్‌తో సతమతమైంది. ఆ సమయంలో డిజిటల్‌ టెక్నాలజీ, రిమోట్‌ వర్కింగ్‌, బయోటెక్నాలజీ, హెల్త్‌కేర్‌ విభాగాల్లో ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఐటీ కంపెనీలకు లభించాయి. దీంతో ఉద్యోగుల అవసరాలు పెరిగి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాయి. ఆయా ప్రాజెక్టులు పూర్తయ్యాక కొత్తగా వచ్చేవి తగ్గుతున్నందున ఉద్యోగుల అవసరాలు తగ్గిపోయాయి. ఆరోగ్య సంరక్షణ, ఔషధ పరిశోధన విభాగాల్లో కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగాఉద్యోగులను తొలగిస్తున్నారు.
  • ఆటోమేషన్‌ విస్తరించడమూ మరొక ప్రధాన కారణం. ఎన్నో విభాగాల్లో ఆటోమేషన్‌ జరిగినందున, ఒక కంపెనీలో 10 మంది చేసే పనిని.. ఇద్దరు, ముగ్గురే పూర్తి చేసేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), ఫేస్‌ రికగ్నిషన్‌, క్వాంటమ్‌ టెక్నాలజీ, ఏఆర్‌-వీఆర్‌, బ్లాక్‌చైన్‌.. వంటి సాంకేతికతలు వినియోగిస్తున్నందున ఆయా విధులను నిర్వర్తించే ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి.
  • ఆర్థిక మాంద్యం మరొక ముఖ్యమైన ముప్పుగా ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి. అమెరికాకు ఈ ఏడాదిలో మాంద్యం ఎదురయ్యే అవకాశమున్నట్లు అనుమానిస్తున్నారు. చైనాలో ఇప్పటికే వృద్ధి క్షీణించింది. ఈ రెండూ పెద్ద ఆర్థిక వ్యవస్థలైనందున.. ఆ పరిణామాల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు, ఐటీ సేవల కంపెనీలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి.

కొత్త ఉద్యోగాలూ వస్తున్నాయి:ఐటీ రంగంలో పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులు వస్తున్నందున, ప్రస్తుతమున్న ఉద్యోగాలు భారీగా తగ్గిపోతాయని ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌’ ఇటీవల అంచనా వేసింది. అదే సమయంలో ఇంతకంటే అధికంగా కొత్త టెక్నాలజీల్లో ఉద్యోగాలు లభిస్తాయని వివరించింది. ప్రధానంగా ఏఐ, డిజిటల్‌ సాంకేతికతల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయని విశ్లేషించింది. కొందరు ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలే, ఆటోమేషన్‌ వంటి కొత్త విభాగాల్లో నైపుణ్యాలు ఉన్న వారిని తీసుకుంటున్నాయని తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు సందీప్‌ కుమార్‌ వివరించారు. 5 నుంచి 7ఏళ్లకోసారి ఐటీలో సాంకేతిక మార్పులు రావడం సహజమని, అందువల్ల పాత నైపుణ్యాలకే పరిమితమైన వారి ఉద్యోగాలు పోవడం సాధారణమేనని గుర్తు చేస్తున్నారు. అటువంటి మార్పు ఇప్పుడు కనిపిస్తోందని తెలిపారు.

నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే:నైపుణ్యాలు పెంచుకోవడంపై దృష్టి సారిస్తే ఐటీ నిపుణులకు ఉద్యోగ భద్రత ఉంటుందని స్థానిక ఐటీ రంగ పరిశీలకుడు సునీల్‌ చక్రవర్తి తెలిపారు. మాంద్యం భయం ఐటీ రంగాన్ని ఆత్మ రక్షణ ధోరణిలోకి నెడుతోందని, ప్రస్తుత ఉద్యోగాల కోతకు ఇదొక ప్రధాన కారణమని ఆయన వివరించారు. పదేళ్ల నాటి నైపుణ్యాలతో పని చేస్తామంటే మనగలిగే పరిస్థితి ఇప్పుడు ఐటీ రంగంలో లేదని, ఎప్పటికప్పుడు తాజా అవసరాలకు అనుగుణంగా నూతన నైపుణ్యాలతో సన్నద్ధమైతేనే ఉద్యోగం పోయే ముప్పు ఉండదని తెలిపారు. కీలక ఐటీ ప్రాజెక్టుల్లో నేరుగా పాల్గొనే వారితో పోల్చితే, సపోర్టు సేవల్లో ఉండే ఐటీ ఉద్యోగులకు ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details