JanaSena leader Mahesh Fire on Mudragada letter: జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతకొన్ని రోజులుగా 'వారాహి విజయ యాత్ర' పేరుతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన.. ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలతో సమావేశమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.. వినతులను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై, సవాళ్లపై, వారాహి యాత్రలో ఆయన ఉచ్చరిస్తున్న భాషపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా మూడు పేజీల లేఖను విడుదల చేశారు. ఆ లేఖపై జనసేన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, బీసీ సంఘం నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ముద్రగడ లేఖపై పోతిన మహేశ్ ఫైర్..కాపుఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖపై జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్ ఘాటుగా స్పందించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే రౌడీ, గూండా, అవినీతిపరుడికి వత్తాసు పలుకుతూ.. ముద్రగడ లేఖను విడుదల చేయటం చాలా దుర్మార్గమన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ముద్రగడ పద్మనాభం చేతులు కలిపినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించినా.. పవన్ కల్యాణ్వ్యాఖ్యలపై ముద్రగడ లేఖ విడుదల చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కాపుల సంక్షేమం కోసం ఏ రోజైనా కనీసం ఒక్క లేఖ అయినా విడుదల చేశారా ముద్రగడ పద్మనాభం..? అని పోతిన మహేష్ ప్రశ్నించారు.