JAI BHEEM BHARAT PARTY MEETING UPDATES: ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదులుగా, చార్టర్డ్ అకౌంటెంట్‌లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, నోటీసులు జారీ చేసిన సీఐడీ పోలీసులపై కూడా ప్రైవేట్ కేసు వేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తుందన్న ఆయన.. సీఐడీ అధికారుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం.. న్యాయవాదులకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఈరోజు జైభీమ్ భారత్ పార్టీ న్యాయ విభాగం అధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. న్యాయవాదుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అధికారం ఉందని ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి, డీజీపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. ఇది మంచి పద్దతి కాదని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో న్యాయవాదులను పిలిచి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోపెట్టి, ప్రభుత్వం ఆనందం పొందాలని చూస్తోందని ఆవేదన చెందారు. సీఐడీ నోటీసులు ఇచ్చేంత తప్పు తామేం చేశామని ప్రశ్నించారు.
ఇదెక్కడి పాలన..ఇదేం పరిపాలన..జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ''తప్పు ముఖ్యమంత్రి జగన్ చేసినా, రామోజీరావు చేసినా చర్యలు తీసుకోవచ్చు. వారు తప్పు చేశారో లేదో న్యాయస్థానంలో నిరూపణ అవ్వాలి. అప్పటివరకు వారు అభియోగాలను మాత్రమే ఎదుర్కొంటారు. న్యాయవాదులకు నోటీసులు ఇవ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పదుల సంవత్సరాల నుంచి మార్గదర్శి వ్యాపారం చేస్తోంది. ఏ రోజు, ఏ ప్రభుత్వం కూడా అక్రమాలను ఫ్రూవ్ చేయాలేకపోయింది. అంటే దానికి అర్థం ప్రభుత్వాల అసమర్థతే కదా.. మీ ప్రభుత్వాలు అసమర్థత పాలన చేసి ప్రజల ప్రాథమిక హక్కుల మీద పడతారా.. మార్గదర్శిలో పనిచేస్తున్న మేనేజర్లలందర్నీ మూడు పూటల విచారణకు పిలిచి.. వారి ప్రాథమిక హక్కులకి భంగం కల్గిస్తారా.. రాష్ట్రంలో కొత్త కంపెనీలు రానీవ్వటం లేదు. ఒకవేళ వచ్చినా వాళ్లని రూ. 10 కోట్లు ఇస్తావా, రూ. 50 కోట్లు ఇస్తావా అంటూ బేరాలు అడుతున్నారు. అందులో మళ్లీ జగన్ పేరిట ట్యాక్స్, సజ్జల పేరిట ట్యాక్స్, భారతి పేరిట ట్సాక్సీలు కట్టాలని రూల్స్ పెట్టారు. అందుకే ఎవరూ ముందుకు రావటం లేదు.'' అని ఆయన అన్నారు.