half day classes till 17th of this month: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరచుకోనున్న నేపథ్యంలో ఎండల దృష్ట్యా ఈ నెల 17వరకు ఒంటి పూట బడులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు పునఃప్రారంభమవుతోన్న దృష్ట్యా అన్ని పాఠశాలల్లోజగనన్న విద్యా కానుక కిట్లు మెుదటి రోజే అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 43 లక్షల 10 వేల 165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు 1,042. 53 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కనీసం ఒక వారం పాటు స్కూళ్లకు సెలవులు పొడగించాలని లేకేశ్ సీఎం జగన్కు సూచించారు. పిల్లలపై ప్రభావం పడకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
కిట్ల పంపిణీని ప్రారంభించనున్న సీఎం జగన్: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ కిట్ల పంపిణీని లాంచనంగా ప్రారంభించనున్నారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్ లు, వర్క్ బుక్ లు, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు అందజేయనున్నారు. వీటితో పాటు 6 నుంచి పదో తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు -తెలుగు డిక్షనరీ, 1 నుంచి 5 వ తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీ తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్లు అందజేయనున్నారు.