Jagananna Colony Beneficiaries Facing Problems :ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అది కనిపించడం లేదు. ఇళ్ల నిర్మాణం సరే అక్కడికి వెళ్లాలంటేనే ఎంతో సమస్యగా మారిందంటున్నారు లబ్ధిదారులు. దారీతెన్నూలేని ప్రాంతంలో కాలనీలు నిర్మిస్తున్న అధికారులు లబ్ధిదారుల కోసం మురుగు కాల్వలు, రహదారులు నిర్మించలేదు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శివారు శాంతినగర్-ఈలప్రోలులో జగనన్న కాలనీకి వెళ్లే రహదారులు మరింత అధ్వానంగా ఉన్నాయి.
YSRCP Government Careless on Jagananna Colonies :జిల్లాలోని కొండపల్లి శివారు శాంతి నగర్-ఈలప్రోలు జగనన్న కాలనీకి దారి లేక లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ లేఅవుట్లో 1605 వరకు ప్లాట్లకు గాను చివరి ప్రాంతంలో ఉన్న ప్లాట్లకు వెళ్లేందుకు అధికారులు రహదారిని అభివృద్ధి చేస్తామని గతంలో చెప్పారు. ఇంతవరకూ ఆ పనులు చేయకపోవడంతో బేస్ మట్టం వరకు వేసిన ఇళ్లతో పాటు ఖాళీ ప్లాట్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లేఅవుట్లో రహదారులు బురదమయంగా మారాయి. అరకొరగా ఉన్న రహదార్లు సైతం తుపాను దాటికి దెబ్బతినడంతో లబ్ధిదారుల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏ మూలకూ చాలక జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు కొందమంది లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు.
చిన్నపాటి వర్షాలకే చెరువులను తలపిస్తున్న కాలనీలు - లబ్ధిదారులు లబోదిబో
YSR Jagananna Colonies Situation in AP :ఇంటి పనులు చేసుకునేందుకు అక్కడికి వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. కొన్నిచోట్ల ఇళ్ల పునాదుల వరకు నీరు చేరింది. దారి లేక పునాదులు వేసేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో లేఅవుట్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు మాత్రమే వేసి ఇతర పనులు చేయకపోవడంతో విద్యుత్ వసతి సమకూరలేదు. రాత్రయితే చాలు ఎవరూ ఉండేందుకు అవకాశం లేదు. వర్షాకాలమైతే చాలుకాలనీ బురదమయంగా మారుతుందని, గృహ నిర్మాణ సామగ్రిని తీసుకు వచ్చేందుకు సైతం వీలుపడటం లేదని స్థానికులు చెబుతున్నారు.