Jagan Mohan Reddy govt is piling up debts: ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ జగనే ఎందుకు కావాలి అంటే.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించినందుకా? ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేనందుకా? ప్రభుత్వ పెన్షనర్లకు.. పదో తేదీ వస్తే తప్ప పెన్షన్లు ఇవ్వలేకపోతున్నందుకా? నిత్యం అప్పులు చేస్తే తప్ప చెల్లింపులు చేయలేని అస్తవ్యస్థ పరిస్థితులు సృష్టించినందుకా? రాష్ట్రాన్ని ఎల్లవేళలా ఓవర్ డ్రాఫ్ట్ ముప్పులో ముంచినందుకా? ఆర్థిక రంగాన్ని దివాలా దిశగా నడిపించినందుకా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో గుత్తేదారులకు అసలు బిల్లులు చెల్లించలేకపోతున్నారు. వాళ్లు హైకోర్టులో బిల్లుల కోసం పోరాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఇచ్చినా.. ఆ ఆదేశాలు అమలు చేయని దారుణ పరిస్థితులు సృష్టించారు. ఇష్టమైన గుత్తేదారులకు బిల్లులు చెల్లించుకుంటూ స్వప్రయోజనాలు పొందుతున్నారు. దీంతో గుత్తేదారులు అసలు రాష్ట్రంలో పనులు చేసేందుకే భయపడుతున్నారు.. మరీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ జగనే ఎందుకు కావాలో వైసీపీ నేతలే సమాధానమివ్వాలి.
ఐఎఎస్ అధికారుల ఆందోళన: మళ్లీ జగనే ఎందుకు కావాలి అంటూ వైసీపీ నేతలు చేసుకుంటున్న ప్రచారంలో ఆర్థిక వ్యవస్థను ఏదో గొప్పగా తీర్చిదిద్దినట్లు బీరాలు పలుకుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదని సాక్షాత్తూ.. విశ్రాంత ఐఎఎస్ అధికారులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన నిధులతో, రాబడులతో, చేసిన అప్పులతో ఆస్తులు సృష్టించడం.. ఆర్థిక ధర్మం. కానీ మన రాష్ట్రంలో ఆస్తులు సృష్టించే కార్యక్రమం లేకుండా పోయింది. పోనీ చేసిన అప్పులతో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా అంటే.. అదీ లేదు. మరీ ఏ విధంగా మళ్లీ జగన్ సర్కారే రావాలని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటారో సమాధానమివ్వాలనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి వ్యాఖ్యలు: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం జీఎస్డీపీ వృద్ధి రేటులో దేశంలో ఆంధ్రప్రదేశ్ 2018-19లో 22వ స్థానంలో ఉంటే.. జగన్ ప్రభుత్వంలో 2021-22 నాటికి దేశంలోనే మొదటి స్థానానికి ఎగబాకిందని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. 2018-19లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశవ్యాప్తంగా 17వ స్థానంలో ఉండగా జగన్ సర్కార్ వచ్చిన తర్వాత 2022-23 నాటికి 9వ స్థానంలో నిలిపారని.. వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు.అప్పుల విషయానికి వస్తే 2014-19 మధ్య కాలంలో అప్పులు 169శాతం పెరిగితే జగన్ హయాంలో 2019-23 మధ్య కాలంలో 58శాతం అప్పులకే పరిమితం చేశారని ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఊదరగొడుతున్నారు. కానీ వాస్తవమేమిటంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాక్షాత్తూ ఆర్థిక మంత్రి అక్టోబరు నెలలోనే అధికారికంగా సచివాలయంలో విలేకరుల సమావేశంలోనే వెల్లడించారు. రాబడులు పెరిగాయని.. అప్పులు తగ్గాయని.. చెబుతూనే ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. దీంతో వైసీపీ సర్కార్ జీఎస్‌డీపీని పెంచి చూపిస్తోందనే చర్చ సాగుతోంది. నిజానికి జీఎస్‌డీపీలో అధిక పెరుగుదల ఉంటే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపించాలి. కానీ రెవెన్యూ వసూళ్లలో పెరుగుదల కనిపించడం లేదు. రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు మించిపోయి అప్పులు పుట్టిస్తున్నారు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేషన్లకు అప్పులు ఇచ్చే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులను హెచ్చరించింది. మంజూరు చేసిన అప్పు కూడా ఇవ్వకుండా ఎస్‌బీఐ నిలిపివేసింది.