Tax increase: సరకు, ప్రయాణికుల రవాణా వాహనాలపై హరిత పన్ను గతేడాదే భారీగా పెంచిన ప్రభుత్వం... తాజాగా త్రైమాసిక పన్నునూ పెంచి మరోసారి నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. సరకు రవాణా వాహనాలకు త్రైమాసిక పన్నును.. 25 నుంచి 30 శాతం వరకు పెంచేలా... ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. నెలరోజుల్లో అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలపాలని.. తర్వాత ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. కాంట్రాక్టు క్యారియర్ బస్సులపై సీటుకు 250 చొప్పున... త్రైమాసిక పన్ను పెంచుతున్నారు. వీటివల్ల మొత్తంగా సరకు, ప్రయాణికుల రవాణా వాహనాలపై ఏడాదికి 200 కోట్లు..అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం 6 టైర్ల లారీకి త్రైమాసిక పన్ను 3,940 ఉండగా... 1,030 పెంచేలా ప్రతిపాదించారు. 10 టైర్ల లారీకి 6,590 పన్ను ఉండగా.. 1,810 రూపాయలు, 12 టైర్ల లారీకి 8,520 పన్నుఉండగా... మరో 2,390 పెంచనున్నారు. 14 టైర్ల లారీకి 10,480 త్రైమాసిక పన్ను ఉండగా 2,950 పెంచనున్నట్లు... నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
కాంట్రాక్టు క్యారియర్‌గా నడిపే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో... ప్రస్తుతం సీటుకు 3,750 చొప్పున త్రైమాసిక పన్ను చెల్లిస్తున్నారు. దీన్ని 4వేలు చేస్తున్నారు. అంటే.. బస్సుకు సగటున 9వేల వరకు.. త్రైమాసిక పన్ను భారం అదనంగా పడనుంది. రాష్ట్రంలో మొత్తం... 3లక్షల లారీలు ఉన్నాయి. వీటిలో రెండున్నర లక్షలు తిరుగుతున్నాయి. వీటన్నింటిపైనా..భారం పడనుంది. గతేడాది నుంచి.. ఈ వాహనాలకు హరితపన్ను భారీగా పెంచారు. గతంలో ఏడాదికి 200 ఉన్న హరితపన్నును... గరిష్టంగా 20వేలకు పెంచేశారు. దీన్ని తగ్గించాలని రాష్ట్ర లారీ యజమానుల సంఘం కోరుతున్నా... ప్రభుత్వం కనికరించలేదు. త్రైమాసిక పన్నుపెంచేలా 3 నెలల కిందట రవాణాశాఖ... ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలియడంతో దాన్ని ఉపసంహరించాలని లారీల యజమానులు సీఎంకు లేఖలు రాశారు.