Jada Sravan on MP Avinash and CBI: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ విచారణకు సహకరించాలని.. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని తెలిపిన విషయం విదితమే. ఓ హత్య కేసులో ఆరోపణలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వటం తనని ఆశ్ఛర్యానికి గురి చేసిందని సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రత్యేక సందర్భంలో మాత్రమే హత్య కేసులో ముందస్తు బెయిల్ వస్తుందన్నారు.
"అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేదని సీబీఐని లీగల్‌గా నిందించడానికి లేదు. కాకపోతే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించే అవకాశం ఉంది. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఒకే విధమైన తప్పు చేశారనేది సీబీఐ అభియోగం. మరి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదు. ప్రతి సందర్భంలో అవినాష్ రెడ్డిని సాక్షిగా ఎందుకు పిలుస్తోంది. అరెస్టు చేసే అవకాశం ఉన్న ఎందుకు వెనకడుగు వేస్తోంది"-జడ శ్రవణ్ కుమార్, హైకోర్టు న్యాయవాది
అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశమున్నా సీబీఐ చేయలేదు
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశమున్నా సీబీఐ చేయలేదని.. శ్రవణ్ కుమార్ ఆరోపించారు. సాక్ష్యాలు ఉన్నాయని చెబుతోందిగానీ.. నిందితుడిగా అవినాష్‌ను సీబీఐ విచారణకు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. సీబీఐ అధికారుల తీరు అవినాష్‌కు సహకరిస్తున్నట్లుగా ఉందన్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై సీబీఐకు, వివేకా కుమార్తె సునీతా రెడ్డిలకు సుప్రీంకోర్టుకు వెళ్లే వెసులుబాటు ఉంటుందని శ్రవణ్ కుమార్ తెలిపారు.
"ప్రతిసారి సీబీఐ అఫిడవిట్లో.. అవినాష్ రెడ్డి నిందితుడని, సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని, సాక్షులను ప్రభావితం చేయగల వ్యక్తి అని, ఆధారాలు చెరిపేయడం, రక్తపు మరకలు శుభ్రం చేశాడని, మర్డర్ జరగడానికి రెండు రోజుల ముందు నుంచే నిందితుడికి ఆశ్రమం ఇచ్చారని, గూగుల్ టేక్ అవుట్, ఇతర సాంకేతిక ఆధారాల ప్రకారం అవినాష్ రెడ్డే నిందితుడని ఓ పక్క కోర్టులో చెబుతోంది. మరోపక్క ఏమో అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని చెపుతోంది. దీనివల్ల సీబీఐని కోర్టు అనుమానిస్తోంది. విచారణ సరిగ్గా జరగడం లేదని.. దర్యాప్తు సంస్థ సరిగ్గా విచారణ చేయడం లేదని, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారనే డౌట్ హైకోర్టుకు క్రియేట్ అయ్యింది. ఈరోజు ఆయనకు బెయిల్ రావడానికి కారణం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థే అని నేను భావిస్తున్నా"-జడ శ్రవణ్ కుమార్, హైకోర్టు న్యాయవాది