ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, సంస్థల్లో ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం - Latest It Raids

Minister Mallareddy: తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ ఇవాళ విస్తృత సోదాలు చేపట్టింది. వచ్చే రెండు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. గత పదేళ్లుగా మల్లారెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న ఇంజినీరింగ్‌, వైద్య, డెంటల్‌, ఇతర రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. 50 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో ఈ తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు.

Minister Mallareddy
మంత్రి మల్లారెడ్డి

By

Published : Nov 22, 2022, 9:09 PM IST

Minister Mallareddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. ఆయనతో పాటు ఇద్దరు కుమారులు, సోదరుడు, అల్లుడు, ఆయన వియ్యంకుడు, స్నేహితులు, మల్లారెడ్డితో పాటు కలిసి వ్యాపారాలు సాగిస్తున్న వారందరి ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో ఈ సోదాలు చేపట్టారు. 50 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు మంత్రి కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి నివాసంతో పాటు బోయినిపల్లి ప్రాంతంలోని మంత్రి సోదరుడు గోపాల్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టింది.

మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలోని మల్లారెడ్డి పెద్దకుమారుడు మహేందర్‌రెడ్డి నివాసం, కొంపల్లిలోని చిన్న కుమారుడు భద్రారెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు కండ్లకోయలోని సీఎంఆర్‌​ ఇంజినీరింగ్‌ కళాశాలలోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రి, నారాయణ ఆస్పత్రి, మల్లారెడ్డి వైద్య కళాశాల, మల్లారెడ్డి డెంటల్‌ కాలేజీల్లో దస్త్రాలు, కంప్యూటర్లు పరిశీలించారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయానికి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మల్లారెడ్డి వైద్య, దంత కళాశాలతోపాటు అస్పత్రులకు మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

మల్లారెడ్డికి చెందిన సంస్థల డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ తనిఖీల్లో లభించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. దాదాపుగా 50 చోట్ల సాగుతున్న ఈ తనిఖీల్లో దస్త్రాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. మంత్రి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన ఆస్తులు, ఆదాయ వనరులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న అభియోగాలతో పాటు పన్ను చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్టు తమ దృష్టికి రావటంతో ఈ సోదాలు చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి.

పది సంవత్సరాల ఐటీ రిటర్న్స్‌ చెల్లింపుల గురించి అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. సోదాల నేపధ్యంలో మంత్రి, ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల వద్ద కేంద్రబలగాలు సీఆర్‌పీఎఫ్ పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసింది. ఇతరులను ఎవ్వరినీ సోదాలు జరుగుతున్న ప్రాంతాలకు అనుమతించటం లేదు. మల్లారెడ్డి కళాశాలలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు క్రాంతి బ్యాంక్ ద్వారా జరిగేవని, వాటి వివరాలను సైతం రాబట్టాలని ఛైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సుచిత్రలోని బీమా ప్రైడ్ అర్బన్ లైఫ్ అపార్ట్‌మెంట్ లో మల్లారెడ్డి సమీప బంధువు త్రిసూల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్యహించారు. కొంపల్లిలోని బొబ్బిలి ఎంపైర్ అపార్ట్మెంట్స్ నివాసముంటున్న సంతోష్ రెడ్డి మల్లారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన నివాసంలో సైతం ఐటీ సోదాలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుండి ఐటీ అధికారులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... మధ్యాహ్నం తలుపులను పగలగొట్టే ప్రయత్నం చేయడంతో సంతోష్ రెడ్డి కుటుంబసభ్యులు ఇంటి తలుపులు తెరిచారు. తర్వాత అధికారులు సోదాలు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details