Chandrababu criticized CM Jagan: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తే అది పగటి కలే అవుతుందని.. చంద్రబాబు నాయుడు అన్నారు. రేపు ఎన్నికలు పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామని.. జగన్‌ని ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. మీడియా ఏర్పాటు చేసిన చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది షాక్ ట్రీట్మెంట్ మాత్రమేనని.. వచ్చే ఎన్నికల్లో చేసేది శాశ్వత చికిత్సని వ్యాఖ్యానించారు.
బుద్ధి ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ఆ ప్రశ్న అడగరు: ''రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోందో చెప్పాలి అనే ప్రశ్న బుద్ధి ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ఎవ్వరూ మమ్మల్ని అడగరు. మేం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో వారికి చెప్పాలా..?. 175 స్థానాల్లో వైసీపీని ఓడించటమే మా లక్ష్యం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకున్న 23 బలంతోనే మా అభ్యర్థిని మేము గెలిపించుకున్నాం. తెలుగుదేశం నుంచి గాడిదల్ని తొలుకెళ్లిన్నట్లు కొందరు ఎమ్మెల్యేలను తోలుకెళ్లి, తిరిగి ఎదురు నిందలు వేయడం విడ్డూరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే వచ్చినా రాజీనామా చేసి రావాలని జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో అనలేదా..?. నీతిమాలిన పనులు చేస్తూ.. మాపై నిందలు వేస్తారా..?. ఎమ్మెల్యే కోటాలో మాకు రావాల్సిన ఒక ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ చేయటం అనైతికమనటం బుద్దిలేని తనం కాక మరేంటి'' అని చంద్రబాబు నాయుడు ప్రశ్నల వర్శం కురిపించారు.
ఏప్రిల్ ఫూల్ పదం జగన్‌కు సరిపోతుంది: అనంతరం ఏప్రిల్ ఫూల్ అనే పదం సీఎం జగన్‌కి సరిగ్గా సరిపోతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజలందరినీ ఎల్లకాలం ఫూల్స్ చేయొచ్చనే భ్రమలో జగన్ ఉన్నారని.. కానీ, రాష్ట్ర ప్రజలంతా కలిసి జగన్‌నే ఫూల్ చేసేందుకు సిద్ధమయ్యారని గుర్తు చేశారు. పుట్టిందే రాష్ట్ర విధ్వంసం కోసం అన్నట్లుగా జగన్ ఉన్నారని.. సీఎం చెడు ఆలోచనలు అంచనా వేయటం కష్టమేమో కానీ, అతని భవిష్యత్తు ఏంటో అంతా అంచనా వేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.