ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిధులు లేక.. నిర్మాణాలకు నోచుకోని ప్రాజెక్టులు - గాలేరు నగరి సుజల స్రవంతి

Ap Irrigation Projects : రాష్ట్రంలో సాగునీటి రంగం ముందుకు సాగటం లేదు. సాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించిన.. అవి క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. బడ్జెట్​లో నిధులు ప్రతిపాదించటమే కానీ, నిధులను వినియోగించి పనులను పూర్తి చేసింది లేదు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వ ఖర్చు చేసే నిధులకు అసలు పోలికే లేదు.

Ap Irrigation Projects
ఆంధ్రప్రదేశ్​ సాగునీటి ప్రాజెక్టులు

By

Published : Jan 17, 2023, 8:02 AM IST

నిధుల కొరతతో రాష్ట్రంలో పడకేసిన సాగునీటి రంగం

Irrigation Projects : రాష్ట్రంలో కీలకమైన సాగునీటి రంగం పడకేసింది. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం తప్ప వాటిని పూర్తి చేయలేక ప్రభుత్వం దాదాపు చేతులెత్తేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి అధికారులు కాగితాలపై పనులను చూపించటం తప్ప క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు చేయిస్తున్నది అంతంత మాత్రమే. బడ్జెట్‌లో నిధులు ప్రతిపాదించడం తప్ప ఒక్క ఏడాది కూడా నిధులను పూర్తిగా వినియోగించింది లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై చేసిన ఖర్చుకు, ఈ సర్కారు చేస్తున్న దానికీ పొంతనే లేదు. జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఆ మధ్య ఓ సందర్భంలో ఇదే విషయాన్ని ప్రకటించారు.

గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈ మూడున్నరేళ్లలో సాగునీటి రంగంపై చేసిన ఖర్చు తక్కువేనని అంగీకరించారు. ఫలితంగా లక్షల ఎకరాలను స్థిరీకరిస్తామని, కొత్త ఆయకట్టుకు నీరందిస్తామన్న జగన్‌ మాటలన్నీ అలాగే మిగిలిపోయాయి. ఆలస్యమైనందు వల్ల ఇప్పటికే అంచనాలు పెరిగిపోయిన ఎన్నో ప్రాజెక్టులు భవిష్యత్తులో.. వాటి నిర్మాణం మరింత భారం కానుంది. పోలవరం ప్రాజెక్టుకు ముందడుగు పడటం లేదు. వెలిగొండ నుంచి కరవు ప్రాంతాలకు ఎప్పుడు నీరందిస్తారో తెలియని గందరగోళ పరిస్ధితి. రాయలసీమ ఎత్తిపోతల పథకం పడకేసింది. వంశధార రెండో దశలోని రెండో భాగం పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా దాని పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే నానా కష్టాలు పడుతున్న ప్రభుత్వం.. సాగునీటి ప్రాజెక్టు పనుల బిల్లులను చెల్లించేందుకు నానా ఆగచాట్లు పడుతోంది. దీంతో ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు.

ప్రభుత్వ తీరు వల్ల ముందుకు రాని గుత్తేదారులు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టులకు 11,482 కోట్ల రూపాయల కేటాయింపులు చూపారు. ఇంతవరకు కేవలం 3,890 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేసినట్లు సమాచారం. అందులో ప్రాజెక్టులు, పునరావాసం వంటి కార్యక్రమాలకు ఖర్చు చేసింది కేవలం 1102 కోట్ల రూపాయలేనని సాగునీటివర్గాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో వైపు గుత్తేదారులకు పెద్ద మొత్తంలోనే బిల్లులు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోవడంతో గుత్తేదారులు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. పాత బిల్లులు కొంత మేర చెల్లింపులు చేసినా.. కొత్తగా పనులు చేపట్టాలంటే గుత్తేదారులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని కొత్త ప్రాజెక్టులకు, పనులకు టెండర్లు పిలుస్తున్నా అనేక చోట్ల గుత్తేదారుల నుంచి స్పందన రావటం లేదు. కేవలం ఒకరిద్దరు మాత్రమే టెండర్లలో పాల్గొంటున్నారు. కొందరు పెద్ద గుత్తేదారులు పనులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటున్నా.. ప్రారంభంలో కొన్ని పనులను చేసి వదిలేస్తున్నారు. చేసిన పనికి బిల్లులు చెల్లిస్తేనే మిగిలిన పనులను పూర్తి చేస్తామని అధికారులకు చెబుతున్నారు. పాత పనులు ముందుకు సాగకా.. కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావటం లేదు.

పోనిలిచిపోయిన ప్రాజెక్టులు : పోలవరం ప్రాజెక్టు పనులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. రాష్ట్రానికే జీవనాడిగా పేర్కొనే ఈ ప్రాజెక్టు 2024లోపు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దిగువ కాఫర్‌ డ్యాం నిర్ణిత సమయంలోపు నిర్మించకపోవడం వల్ల వానాకాలంలో వరదల సమయంలో పనులు చేపట్టాటానికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు రాయలసీమ వరద ప్రాజెక్టులకు, పల్నాడు కరవు నివారణ పథకానికి, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఇదే ఆధారంగా ఉంది. పోలవరం బిల్లులు భారీగా పెండింగ్​లో ఉన్నాయి.

వంశధార రెండో దశ తొలి, రెండో భాగాలు:వంశధార రెండో దశ తొలి భాగం పనులు పూర్తయితే ఏడు మండలాలకు చెందిన 165 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది. 62,280 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. దీనికి ఇటీవలే 209 కోట్ల రూపాయలతో అంచనాలను సవరించారు. పనులకు సరిపోయే నిధులను ఖర్చు చేయడం లేదు. రెండో భాగంలోని మూడు ప్యాకేజీల్లో గత ప్రభుత్వ హయాం ముగిసేనాటికి దాదాపు పనులు పెద్ద మొత్తంలో పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇంకా 590 కోట్ల రూపాయలు అవసరమని లెక్కించారు. అంతా మొత్తంలో అవసరం ఉన్న దీనికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 115 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. ఖర్చు చేసింది కొద్ది మొత్తమే అయినా.. ఈ విధంగా నిధులిస్తే గడువు లోపు ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యం కాదు.

మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు నిర్మాణం: దీని వల్ల శ్రీకాకుళం జిల్లా టెక్కలి, నందిగామ, పలాస, మెళియపుట్టి మండలాల్లోని 108 గ్రామాల్లోని ఆయకట్టుకు ప్రయోజనం కలుగుతుంది. 24,600 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఇంకా 340 కోట్ల రూపాయలు అవసరమని గతంలో లెక్కించగా.. అలాంటిది మళ్లీ అంచనాలను పెంచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 54 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయింపులు చూపినా.. ఖర్చు చేసింది మాత్రం అంతతా మాత్రమే

వెలిగొండ ప్రాజెక్టు: ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఇది ఎంతో కీలకం. దీని వల్ల మూడు జిల్లాల్లోని 4,47,300 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. తాగునీటి వసతి లభిస్తుంది. ఇది పూర్తి చేయాలంటే గతంలో 3,782 కోట్ల రూపాయలు అవసరమని లెక్కించారు. ప్రస్తుతం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే వెలిగొండ పూర్తవుతుంది. కరవు ప్రాంతాలకు మేలు కలిగించే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.

గాలేరు నగరి సుజల స్రవంతి: రెండో దశ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. గాలేరు నగరి తొలిదశలో సింహభాగం పనులు 2019 నాటికే పూర్తయినా ఇప్పటికీ అది కొలిక్కి రాలేదు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 2023 జులై వరకు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. గాలేరు నగరి రెండో దశ కేవలం రెండు ప్యాకేజీలకే పరిమితమవుతోంది. కోడూరు వరకు 2023 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనేది ప్రణాళిక. ఇది పూర్తైతే కడప, చిత్తూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది.

హంద్రీ నీవా సుజల స్రవంతి :ప్రాజెక్టు తొలిదశ ఎప్పుడో పూర్తయినా ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయలేదు. ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదు. రెండో దశ పనులు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నా ఆలస్యమవుతున్నాయి. దీనికి కారణం నిధులు ఇవ్వకపోవడమే ప్రధాన సమస్య. ఇదేకాకరాయలసీమలోని అనేక చోట్ల రిజర్వాయర్లు నిర్మించి నీళ్లు నిల్వచేసిన.. ఆ నీటీని అందించటానికి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తి చేయలేదు. దీంతో కోట్ల రూపాయల నిధులతో చేపట్టినా పనుల వల్ల ఫలితం లేకుండా పోయింది.

ప్రణాళికలు కాగితాలకే పరిమితం : ముఖ్యమంత్రి జగన్‌ 2019 నవంబరులో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్నవి, కొత్త ప్రాజెక్టులకు, పోలవరంతో సహా మొత్తం పూర్తి కావటానికి 1,64,815 కోట్ల రూపాయలు అవసరమని తేల్చారు. నిర్మాణంలో ఉన్న వాటిని ప్రాధాన్యాల వారీగా వర్గీకరించారు. ఆ సమావేశంలో సీఎం మార్గదర్శకాలను అనుసరించి 2020 సెప్టెంబరు నాటికి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దానికి అనుగుణంగా సెప్టెంబరులో సీఎం జగన్‌ వద్ద సమీక్ష నిర్వహించి ప్రణాళికను కొలిక్కి తెచ్చారు. అప్పటికి పెండింగులో ఉన్న ప్రాజెక్టులు, సర్కారు కొత్తగా చేపడదామనుకున్న వాటిని కలిపి మొత్తం 54గా లెక్కించారు. వాటిలో 42 ప్రాజెక్టులకు 2024 సంవత్సరం వరకు. ఏ సంవత్సారానికి ఎంత నిధులు వెచ్చిస్తే పూర్తి అవుతాయో ప్రణాళికలు రూపొందించారు. కేవలం వీటికే 24,092 కోట్ల రూపాయలు అవసరమని లెక్కించారు. అవి కాకుండా కొత్త వాటికి మరో 72,458 కోట్ల రూపాయలు అవసరమని ప్రతిపాదించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details