Procurement of Grain: ధాన్యం కనీస మద్దతు ధర కంటే పైసా తగ్గకూడదు.. రైతులకు అందాల్సిన మొత్తం పక్కాగా అందాల్సిందే.. ఇదీ ధాన్యం సేకరణపై సమీక్ష సందర్భంగా ఇటీవల ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఇచ్చిన ఆదేశం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. సీఎం మాటలు నీటిమూటలుగా మిగులుతున్నాయి. రైతులు ఎంత ధాన్యం విక్రయించారనే రశీదులతో సంబంధం లేకుండా.. మిల్లర్లు చెప్పిన లెక్కలనే ఆర్బీకేల్లో నమోదు చేస్తున్నారు. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున త్వరగా ధాన్యం అమ్ముకోవాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా తేమ శాతం పేరిట మిల్లర్లు అడ్డంగా దోచుకుంటున్నట్లు.. ఈనాడు-ఈటీవీ భారత్ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరుకు చెందిన యనమదల రామ్మోహనరావు, జేబీ, రాజేష్ 19 ఎకరాల్లో వరి పండించారు. ఇటీవలే రైతు భరోసా కేంద్రం ద్వారా రెండు విడతలుగా 485.30 క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు. తరుగు కింద బస్తాకు కిలో చొప్పున మినహాయిస్తే.. 474.20 క్వింటాళ్ల ధాన్యానికి 9 లక్షల 67వేల 368 రూపాయల సొమ్ము రావాలి. కానీ 430 క్వింటాళ్ల ధాన్యమే అమ్మినట్లుగా ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఆ లెక్కన 90 వేల 168రూపాయల నష్టపోయానని రామ్మోహనరావు వాపోతున్నారు.
"నేను విక్రయించిన వడ్లకు నా ఖాతాలో జమ అయిన నగదుకు తేడా 40 క్వింటాళ్లు వస్తోంది. నగదు పూర్తిగా జమ కాలేదు. మిగిలిన నగదు పరిస్థితి ఎంటీ. వాళ్ల లెక్కల ప్రకారమే ఇంకా 90వేల రూపాయలు రావాలి. నగదు గురించి అడిగితే లెక్కలు సరిచూడాలి అంటున్నారు." -రామ్మోహనరావు, రైతు, మద్దూరు
మద్దూరు గ్రామానికే చెందిన అప్పారావు సహా మరికొందరు రైతులదీ ఇదే పరిస్థితి. అమ్మిన ధాన్యానికి, ఫోన్లకు వస్తున్న మెసేజ్‌లో చూపిస్తున్న లెక్కలకు చాలా తేడా ఉంటోంది. రైతుభరోసా కేంద్రంలో తేమ శాతం 17శాతమే ఉన్నప్పుడు, మిల్లర్ వద్దకు వెళ్లాక ఎలా పెరిగిందని రైతులు ప్రశ్నిస్తున్నారు.