Interstate Chain Snatching Gang : అతనిది తెలంగాణ రాష్ట్రం.. చదివింది ఏడో తరగతి.. అతని వృత్తి క్యాటరింగ్... ప్రవృతి మాత్రం దొంగతనం. అతని అలోచనలతో ఉన్న దూరపు బందువును దగ్గర చేసుకున్నాడు. మొదట దొంగతనాలుగా వాళ్ల జీవితం మొదలై చైన్ స్నాచింగ్ వరకూ వెళ్లింది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చైన్ స్నాచింగ్ చేసేవాళ్లు. వాళ్లు ఉదయాన్నే బయలుదేరి పని కానిస్తారు. ఒంటరి మహిళ మెడలో బంగారు గొలుసు వాళ్ల కళ్లలో పడిందా అంతే సంగతులు. గొలుసును చూడగానే వాళ్ల కళ్లలో మెరుపు వస్తుండేది. ఇలా ప్రవృతిని సాఫీగా సాగించేవాళ్లు. ఇలా కొనసాగుతున్న వాళ్ల వ్యవహారంలో మనస్పర్ధలు తలెత్తాయి. ఇద్దరు కాస్తా నలుగురు అయ్యారు. ఏపీ పోలీసులు నలుగుర్ని నాలుగు గోడలకే పరిమితం అయ్యేలా మూకుమ్మడిగా కటకటాల్లోకి నెట్టారు. వాళ్ల ఆగడాలను పోలీసులు ఎలా ఆడ్డుకట్ట వేశారో తెలుసుకుందామా?
అయిదున్నర నెలల కాలంలో 18 చోరీలు: ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో చెలరేగిపోయిన గొలుసు దొంగల ముఠా గుట్టు రట్టయింది. అయిదున్నర నెలల కాలంలో 18 చోరీలకు పాల్పడి, పోలీసులకు సవాలుగా నిలిచిన ఈ ముఠా ఎట్టకేలకు నందిగామ పోలీసులకు దొరికిపోయింది. గురువారం విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రూరల్ డీసీపీ డి. మేరీప్రశాంతి వివరాలు వివరించారు.
మనస్పర్ధలు.. అసిస్టెంట్లు : తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గొర్రె శ్రీనివాస్ (22) క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. జల్సాలకు అలవాటు పడి, దూరపు బంధువైన చల్లా వెంకటేశ్వర్లుతో కలిసి, తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేస్తుండేవాడు. ఆ డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డారు. అతి సులువుగా డబ్బులు సంపాదించాలన్న లక్ష్యంతో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లు ప్రారంభించారు. వీళ్లకు మనస్పర్ధలు రావడంతో.. ఖమ్మం జిల్లా సుక్రవరపు కోటకు చెందిన కొనగళ్ల గణేష్, దేవనబోయిన మహేష్ (26)లను అసిస్టెంట్లుగా నియమించుకున్నారు. అయినా కూడా ఈ నలుగురు కలిసి గొలుసు నేరాలకు పాల్పడ్డారు.