Womens Day Wishes : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు మహిళలు వేడుకలు నిర్వహించారు. విదేశాల్లోనూ తెలుగు మహిళలు మహిళా దినోత్సవం జరుపుకొన్నారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. మహిళా సమానత్వం, సాధికారత కోసం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
మహిళలకు గవర్నర్ శుభాకాంక్షలు : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్‌నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు దేశ నిర్మాణంలోనూ, జాతీయ సమగ్రత, శాంతి, సామరస్యాన్ని నిలబెట్టడంలో ఎల్లప్పుడూ గొప్ప పాత్ర పోషిస్తూ వచ్చారని కొనియాడారు. మహిళలు ఎప్పుడు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. సమాజంలోనూ, కుటుంబ సంప్రదాయాలలోనూ, ఇంకా అనేక రంగాలలో మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. స్త్రీలు సహనం, ఓర్పుకి మారుపేరని అన్నారు. కుటుంబ వ్యవస్థలో సమ బాధ్యతలను నిర్వహిస్తారని, అందుకే వారిని ఆకాశంలో సగ భాగం అంటారని గవర్నర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సమానత్వం, సాధికారతకు తెలుగుదేశం కట్టుబడి ఉంటుంది : తెలుగుదేశం అధినేత చంద్రబాబు మహిళలకు అంతార్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడైతే స్త్రీకి భద్రత, గౌరవం, స్వేచ్ఛ, సాధికారత ఉంటాయో.. అక్కడ సమాజం సంతోషమయం అవుతుందని అన్నారు. మహిళా సమానత్వం కోసం, సాధికారత కోసం తెలుగుదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న ప్రతి స్త్రీ మూర్తికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.