ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. - రోటరీక్లబ్ ఆఫ్ విజయవాడ మిన్టిన్

Womens Day : విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించగా ముఖ్య అతిథిగా సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు మన దేశ స్త్రీలు వెనుకంజలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

International Womens Day Celebrations
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

By

Published : Mar 8, 2023, 12:04 PM IST

విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

International Womens Day Celebrations : నైతిక విలువలు నేర్పిస్తూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించే మొదటి గురువు మాతృమూర్తి అని సీబీఐ విశ్రాంత జాయింట్​ డైరెక్టర్​ వీవీ లక్ష్మీనారాయణ కొనియాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా.. ఆర్థిక, సామాజిక, రాజకీయాలలో మనదేశం ఇంకా 135వ స్థానంలో ఉండటం బాధకమన్నారు. విజయవాడలోని సిద్ధార్ధ మహిళా కళాశాలలోని మహిళా సాధికారత విభాగం, స్పృహాప్తి ఛారిటబుల్ ట్రస్ట్, రోటరీక్లబ్ ఆఫ్ విజయవాడ మిన్టిన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అంతే కాకుండా వివిధ రంగాలలో సేవ చేసిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్షీ నారాయణ హాజరయ్యారు.

చిన్నపిల్లలకు తల్లిదండ్రులు బోధించిన అంశాలే.. వారు పెరిగి పెద్ద అయిన తర్వాత వారి జీవితంపై ప్రభావం చూపుతాయని అన్నారు. ఇప్పటికీ పురుషులతో సమానంగా పనిచేసిన మహిళలకు వేతనాలు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న హింసలు ఆగాలని.. గృహహింస, వేధింపులకు గురి కావటం, వారిపై దాడులు, లాంటి ఘటనలపై నియంత్రణ ఉండాలన్నారు. విద్యార్థులు మార్కుల వెనక పరుగెత్తకూడదని సూచించారు. మార్కులే జీవితానికి పరమావధి కాదన్నారు. విద్యార్థులలో ఉన్నత వ్యక్తిత్వం పెంపొందించేలా తీర్చిదిద్దాలని కోరారు. నేడు విద్యార్థులపై సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉందని అన్నారు. చేతిలోనే సెల్​ఫోన్​ ఉండటంతో ఏది కావాలన్న క్షణాల్లో అందుబాటులో ఉంటోందని తెలిపారు. దీని వల్ల వారిపై చెడు ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

"ఒక వ్యక్తి ఆలోచన, సంస్కారం, ఆలోచన విధానం మొదట ఇంట్లోనే మొదలవుతుంది. అందులో తల్లి మనకు ఏ విధమైన ఆలోచనను నేర్పుతుందో.. ఆ విధంగా మనం తయారవుతాము. కాబట్టి వ్యక్తి జీవితంలో తల్లి పాత్ర ప్రధానమైనది. ఆర్థిక, సమాజిక, రాజకీయ అంశాలను స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం.. ప్రపంచ దేశాలతో పోల్చినపుడు మనం 135వ స్థానంలో ఉన్నాం. అంటే మనం చేయాల్సింది చాలా ఉంది." - వీవీ లక్ష్మీనారాయణ, సీబీఐ విశ్రాంత జాయింట్ డైరెక్టర్

మహిళలు అన్ని రంగాల్లో రాణించి అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం రావాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​ పర్సన్​ వాసిరెడ్డి పద్మ సూచించారు. స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల మహిళలు అనేక పదవులలో ఉన్నారని అన్నారు. ఇలా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినప్పుడే మహిళాభ్యున్నతి సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్త్రీ లేకపోతే సృష్టి అనేదే లేదని సిద్ధార్థ మహిళా కళాశాల డైరెక్టర్​ టీ విజయలక్ష్మి తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని.. అయినప్పటికి ఇంకా ముందుకు రావాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details