ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్గదర్శి కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు...

Interim orders of High Court: మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చిట్‌ రిజిస్ట్రార్లను హైకోర్టు ఆదేశించింది. చిట్‌ రిజిస్ట్రేషన్‌, దస్త్రాల స్వీకరణ, సెక్యూరిటీ సొమ్ము విడుదల, తదితర వ్యవహారాల్లో చిట్‌ఫండ్‌ చట్ట నిబంధనల మేరకు వ్యవహరించాలని తేల్చిచెప్పింది.

మార్గదర్శి చిట్‌ఫండ్‌
Interim orders of High Court

By

Published : Dec 27, 2022, 8:13 AM IST

Updated : Dec 27, 2022, 11:19 AM IST

margadarsi chit fund: మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చిట్‌ రిజిస్ట్రార్లను హైకోర్టు ఆదేశించింది. చిట్‌ రిజిస్ట్రేషన్‌, దస్త్రాల స్వీకరణ, సెక్యూరిటీ సొమ్ము విడుదల, తదితర వ్యవహారాల్లో చిట్‌ఫండ్‌ చట్ట నిబంధనల మేరకు వ్యవహరించాలని తేల్చిచెప్పింది. సంస్థకు చెందిన కొన్ని శాఖల్లో వివరాలు కోరుతూ రిజిస్ట్రార్లు డిసెంబరు 20న ఇచ్చిన నోటీసుకు.. మార్గదర్శి సంస్థ నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సూచించింది. సమాధానం అందుకున్న తర్వాత చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 46(3)లో పేర్కొన్న విధానాన్ని రిజిస్ట్రార్లు తప్పనిసరిగా పాటించాలంది.

మార్గదర్శి వివరణను నిష్పాక్షికంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అప్పటి వరకు పిటిషనర్‌ సంస్థలపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ 6 దశాబ్దాలుగా చిట్‌ వ్యాపారం నిర్వహిస్తోందని, సంస్థ అవకతవకలకు పాల్పడినట్లు కానీ, ఖాతాదారులకు సొమ్ము ఎగవేసినట్లుగానీ తమకు ఫిర్యాదులు అందలేదని అధికారులే అంగీకరిస్తున్నారని గుర్తుచేసింది. చిట్‌ ప్రారంభానికి ముందే చిట్‌ మొత్తానికి ఫోర్‌మన్‌ 50 శాతం సొమ్మును రిజిస్ట్రార్‌ వద్ద, మిగిలిన 50 శాతం సొమ్ముకు బ్యాంకు గ్యారంటీ రూపంలో సెక్యూరిటీ ఇస్తున్నారని పేర్కొంది.

ఆ విధంగా ఖాతాదారుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తున్నారని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే పిటిషనర్‌ సంస్థకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించింది. మధ్యంతర ఉత్తర్వులు పొందే వ్యవహారంపై మార్గదర్శి సంస్థ న్యాయస్థానానికి పూర్తి సంతృప్తికరమైన వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలిస్తున్నామని స్పష్టం చేసింది. అనుబంధ పిటిషన్లను పెండింగ్‌లోనే ఉంచిన కోర్టు విచారణను సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ప్రధాన వ్యాజ్యంలో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి సోమవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

* చిట్‌ఫండ్‌ చట్ట నిబంధనల మేరకు చట్టబద్ధ విధులను నిర్వర్తించేలా చిట్‌ రిజిస్ట్రార్లను ఆదేశించాలని, నిర్దిష్ట గడువులో తమ అభ్యర్థనలను పరిష్కరించకుండా.. నిబంధనల మేరకు నడుచుకోలేదనే కారణం చూపి తమపై జరిమానా విధించకుండా నిలువరించాలని, తొందరపాటు చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ ‘మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శి సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, రాష్ట్ర ప్రభుత్వం, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఈ నెల 23న వాదనలు ముగియగా.. కోర్టు సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది.

* మార్గదర్శిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ దుష్ప్రచారం చేస్తున్నారని పిటిషనర్‌ వేసిన అఫిడవిట్‌లోని అంశాన్ని హైకోర్టు గుర్తుచేసింది. ఐజీ ఆదేశాల మేరకు సంబంధిత పరిధిలోని రిజిస్ట్రార్లు నవంబర్‌ 15, 16 తేదీల్లో తనిఖీలు నిర్వహించారు. చట్టప్రకారం తనిఖీలకు ఏడు రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఎటువంటి నోటీసివ్వకుండా తనిఖీలు నిర్వహించారు. కేంద్ర కార్యాలయంలో తనిఖీలపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.

* చట్టంలోని సెక్షన్‌ 4 ప్రకారం చిట్‌ నిర్వహణకు అనుమతి ఇస్తూనే రిజిస్ట్రార్లు.. కమెన్స్‌మెంట్‌ ధ్రువపత్రం, సెక్యూరిటీ డిపాజిట్ల విడుదల, మీటింగ్‌ ఆఫ్‌ మినిట్స్‌ నమోదు చేయడానికి నిరాకరిస్తున్నారు. అధికారుల చర్యలతో తీవ్ర నష్టం జరగనుందంటూ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని న్యాయస్థానం గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులిస్తున్నామని పేర్కొంది.

* 1962లో ప్రారంభమైన మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ నాలుగు రాష్ట్రాల్లో విస్తరించింది. మొత్తం 108 శాఖల్లో 2.71 లక్షల మంది ఖాతాదారులకు సేవలందిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.9,678 కోట్ల టర్నోవర్‌ సాధించింది. చిట్‌ఫండ్‌ చట్టం 1982 ప్రకారం వివిధ రాష్ట్రాలు రూపొందించిన నియమనిబంధనలను పాటిస్తూ.. కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మొత్తం రూ.2,816 కోట్లు ఉండగా.. ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.580 కోట్లు మాత్రమే.

ఇవీ చదవండి:

Last Updated : Dec 27, 2022, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details