ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Inter Students Dharna: సమస్యల పరిష్కారానికి ఎన్టీఆర్​ కలెక్టరేట్ ఎదుట ఇంటర్ విద్యార్థుల ధర్నా

Students Protest At Collectorate: ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎన్టీఆర్ జిల్లా కరెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమకు వెంటనే ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Inter Students Dharna
కలెక్టరేట్ ఎదుట ఇంటర్ విద్యార్థుల ధర్నా

By

Published : Jun 26, 2023, 5:13 PM IST

Students Protest At Collectorate: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమకు వెంటనే ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ.. నిరసనలు చేపట్టారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది విద్యార్థులకు అందజేసిన పుస్తకాలు.. వారి నుంచి సేకరించి ఈ ఏడాది కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులకు ఇవ్వడానికి 500 రూపాయలను కళాశాల యాజమాన్యం వసూలు చేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మండిపడ్డారు. దీంతోపాటు ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇచ్చేదే లేదని ఆయన తేల్చి చెప్పారని ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలోనే వైసీపీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తుందని ఆయన చెప్పారని, వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రాకుంటే.. విద్యార్థుల పరిస్థితి ఏంటని ఎస్​ఎఫ్​ఐ ప్రతినిధులు ప్రశ్నించారు.

దీంతోపాటు ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కావల్సిన మౌలిక సదుపాయాలు కూడా లేవని అన్నారు. కాగా.. తామంతా పేద విద్యార్థులమని.. అందుకే ప్రభుత్వ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నామని.. తమకు ప్రభుత్వం తక్షణమే పాఠ్యపుస్తకాలు అందజేయాలని విద్యార్థులు కోరారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు.

కలెక్టరేట్ ఎదుట ఇంటర్ విద్యార్థుల ధర్నా

"విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. విద్యారంగానికి అనేక నిధులను కేటాయించినట్లు.. నాడు-నేడు పేరుతో అభివృద్ధి చేస్తున్నాం, అమ్మఒడి, విద్యాదీవెన వంటివి ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్తోంది. కానీ చదువుకోవటానికి పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా.. ఇలాంటివి ఎన్ని ఇచ్చినా ఉపయోగం లేదని మేము భావిస్తున్నాం. విద్యార్థులు చదువుకోవాలంటే.. వారికి పాఠ్యపుస్తకాలు ఇచ్చి ఫీజులు తగ్గించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ఈ విద్యాసంవత్సరమైనా పాఠ్యపుస్తకాలను ఇవ్వాలని విద్యాశాఖ మంత్రిని కోరగా.. ఆయన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ఈ ఏడాది ఇచ్చేదే లేదని తేల్చిచెప్పారు." - సోమేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు

"మా కళాశాలలో ఇంతకుముందు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డబ్బులు చెల్లించి.. టెక్స్ట్ బుక్స్ తీసుకోమంటున్నారు. పాఠ్యపుస్తకాలు ఫ్రీగా ఇస్తారనే.. మాలాంటి పేదవాళ్లు, వెనుకబడిన తరగతుల వాళ్లు గవర్నమెంట్ కళాశాలల్లో చేరుతారు. కానీ ప్రభుత్వం మమ్మల్ని కూడా డబ్బులు పెట్టి పుస్తకాలు కొనుగోలు చేసుకోమంటోంది." - విద్యార్థుల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details