ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ సమీపంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్.. అధికారులకు కనిపించని మట్టితవ్వకాలు - Illegal mining in the state

Vijayawada illegal soil mining: విజయవాడ నగరానికి సమీపంలోనే యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అటవీశాఖ, మైనింగ్, పర్యావరణ అనుమతులేవీ లేకుండానే అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. విజయవాడ గ్రామీణ మండలంలోని కొత్తూరు రిజర్వ్‌ ఫారెస్టుకు 500 మీటర్ల పరిధిలోనే ఆనుకుని ఉన్న భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డంగా తవ్వేస్తున్నారు. నైనవరం, కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, జక్కంపూడి గ్రామాల పరిధిలో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులకు అనేకసార్లు స్థానికులు ఫిర్యాదులు చేసినా.. ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అన్ని శాఖల అధికారులకూ భారీగా మామూళ్లు అందుతుండడమే దీనికి కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.’అక్రమ తవ్వకాలపై తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్‌ దృష్టిసారించింది.

Vijayawada illegal soil mining
Vijayawada illegal soil mining

By

Published : Mar 20, 2023, 1:22 PM IST

Vijayawada illegal soil mining: విజయవాడ నగరానికి సమీపంలోనే విచ్చలపిడిగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కేసరపల్లికి చెందిన మాజీ సైనికోద్యోగి పిల్లి సురేంద్రబాబు ఎన్‌జీటీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌జీటీ ధర్మాసనం అక్రమ తవ్వకాలను దృష్టిలోకి తీలుకొని సమగ్రంగా విచారణ జరపాలంటూ మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్‌ అండ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ విభాగాన్ని ఆదేశించింది. దీనికోసం చెన్నైలోని రీజియన్‌ కార్యాలయం ఆధ్వర్యంలో ఒక బృందాన్ని విచారణ కోసం ఏర్పాటు చేశారు. కొత్తూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉన్న భూముల్లో ఎక్కడెక్కడ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయో.. ఆ ప్రాంతాలన్నింటినీ ఈ బృందం పరిశీలించనుంది. అనంతరం నివేదికను తయారుచేసి ఎన్‌జీటీకి సమర్పిస్తుంది. విజయవాడ గ్రామీణ మండలంలోని కొత్తూరు, తాడేపల్లి, నైనవరం, జక్కంపూడి గ్రామాల్లో జరుగుతున్న తవ్వకాలను ఈ బృందం పరిశీలిస్తున్నట్టు తమకు సమాచారం అందించారని ఫిర్యాదుదారు పిల్లి సురేంద్రబాబు తెలిపారు.

10 ప్రాంతాల్లో భారీగా..

కొత్తూరు రిజర్వ్‌ ఫారెస్టుకు సమీపంలో ఉన్న దాదాపు 10 గ్రామాల్లో భారీగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. వందలాది ఎకరాల్లో మట్టిని బాగా లోతుగా తవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌కు 500 మీటర్ల సమీపంలో ఎటువంటి తవ్వకాలు జరపకూడదనే ఖచ్చితమైన నిబంధనలున్నాయి. అటవీ, మైనింగ్, పీసీబీ, రెవెన్యూ సహా అధికారులెవరూ కూడా కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. నిత్యం వందలాది లారీల్లో మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్నారు.

వేలాది లారీల మట్టిని తరలించి..

ఎన్‌జీటీకి అందిన ఫిర్యాదులో విజయవాడ గ్రామీణ మండలంలోని ఏఏ ప్రాంతాల పరిధిలో ఏఏ సర్వే నంబర్లులో ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అనే వివరాలు అన్నీ ఉన్నాయి. మఖ్యంగా కొత్తూరులోని సర్వే నంబరు 40 పరిధిలో గత కొన్ని నెలల నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడ మాత్రమే కాకుండా కొత్తూరు, తాడేపల్లి పరిధిలోని ఆర్‌ఎస్‌ నంబరు 256, జక్కంపూడి గ్రామ సమీపంలో ఆర్‌ఎస్‌ నంబరు 115లో అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నారు. వేమవరం పరిధిలోని కొత్తూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌ను ఆనుకొని ఉన్న ప్రాంతంలో విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు. నైనవరంలోని ఆర్‌ఎస్‌ నంబరు 148లో ఇప్పటికే పెద్ద మొత్తంలో తవ్వేశారు. వేల కొద్ది లారీల మట్టిని తరలించి అమ్ముకున్నారు.

మట్టి కనిపిస్తే చాలు..

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అధికార పార్టీ నేతలు చాలామంది మట్టి తవ్వకాలతోనే గత మూడు నాలుగేళ్లలో రూ.వందల కోట్లను కొల్లగొట్టారు. ఒక్కో టిప్పర్‌ లోడుకు స్థానికంగా రూ.10 వేలు, దూరంగా ఉన్న ప్రాంతాలకు వెళితే.. రూ.12 నుంచి రూ.15 వేల వరకూ అమ్ముకుంటున్నారు. ప్రైవేటు వెంచర్లను మెరక చేసేందుకు, రోడ్లు, జగనన్న ఇళ్ల లేఅవుట్లు సహా అన్నింటికీ ప్రస్తుతం మట్టి కొరత తీవ్రంగా ఉంది. దీంతో డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈనేపథ్యంలో అక్రమార్కులు ఏ ప్రాంతాన్నీ వదలడం లేదు. మట్టి కనిపిస్తే తవ్వేసి అమ్ముకుంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details