BJP state president Somuveer raju latest comments: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు కలిసే ఉన్నాయని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అందుకే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తాజాగా దిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిశారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన - బీజేపీలు కలిసి రాష్ట్రంలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపుతాయని తెలిపారు. రాజకీయాల్లో ఎవరూ అంటరానివాళ్లు కాదని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలవడంలో తప్పేముంది..? గతంలో తాను కూడా చంద్రబాబును కలిశానని సోము వీర్రాజు గుర్తు చేశారు. రాజకీయంగా జనసేన-బీజేపీలు కలిసి పని చేస్తాయని సోము వీర్రాజు పేర్కొన్నారు.
కలిసే పోరాడుతాం: ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ.. "జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయి, కలిసే ముందుకు వెళతాం. ఈ ప్రభుత్వంపై ఇద్దరం కలిసే పోరాడతాం. కలిసి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా జనసేన, బీజేపీ కలిసే ప్రయాణం చేస్తాయి. రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తాం. గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశాం. అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదు. తాజాగా పవన్ కల్యాణ్ మా పార్టీ పెద్దలను కలిసి మాట్లాడారంటే.. మా బంధం ఎంత బలమైనదో తెలుసుకోండి. మేమిద్దరం కలిసి వైసీపీ ప్రభుత్వం మీద ఉద్యమిస్తాం. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. రాజకీయాల్లో కొన్ని రచనలు జరుగుతాయి. నాయకులు ఏది మాట్లాడినా ఒక వ్యూహంతో మాట్లాడతారు. మా సత్యకుమార్, ఇతర నేతలపై దాడి అందరూ చూశారు. మా పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉంది'' అని ఆయన అన్నారు.