Illegal Soil Mining in NTR District: విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లి సమీపంలోని అస్సైన్‌మెంటు భూముల్లో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. గనులశాఖ నోటీసిచ్చినా లెక్కచేయడం లేదు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రెచ్చిపోతున్నారు. మట్టి తరలిస్తున్న లారీలను కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన కొంతమంది అడ్డుకున్నా.. చంపేస్తామంటూ బెదిరించి తీసుకెళ్తున్నారు.
ఎన్ని విచారణలు జరిగితేనేం. ఎన్ని కేసులు నమోదైతేనేం.. ఎన్ని నోటీసులు జారీ చేస్తేనేం.. మమ్మల్ని ఆపేదెవరు అన్నట్లు కొత్తూరు తాడేపల్లిలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. గనుల శాఖ నుంచి నోటీసులు అందుకున్నప్పటికీ.. వైకాపా నాయకులు మట్టి తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. తాత్కాలిక అనుమతులంటూ.. పర్యావరణ, కాలుష్య నియంత్రణ శాఖల అనుమతులు లేకుండానే రెవెన్యూ, గనులశాఖల్ని అడ్డం పెట్టుకుని తవ్వేస్తున్నారు. విజయవాడ బైపాస్ నాలుగో ప్యాకేజీకి గ్రావెల్ తరలిస్తున్నారు. అయితే వీరు పాత్రధారులు మాత్రమే నని.. వీరి వెనుక పెద్దలు ఉన్నారని స్థానికులు అంటున్నారు.
Soil Mafia in Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలో ఇప్పటికే 150 ఎకరాలకు పైగా విస్తీర్ణం, అటవీ స్థలంలో 200 కోట్ల రూపాయల విలువైన మట్టి తరలించారని అంచనా. గనుల శాఖ సుమారు 59 ఎకరాల్లో 6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలించారని నివేదించింది. గనుల శాఖ నివేదిక తర్వాత కూడా మట్టి తవ్వుతూనే ఉన్నారు. దీనిపై పిల్లి సురేంద్రబాబు జాతీయ హరిత ట్రైబ్యునలకు ఫిర్యాదు చేయడంతోపాటు హైకో ర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు రెండుసార్లు కమిటీ పర్యటించగా వాటికీ మట్టి మాఫియా అడ్డంకులు సృష్టించింది.