Illegal Soil Excavations in Various Districts: రాష్ట్రంలో ఎక్కడ చూసినా మట్టి మాఫియా ఆగడాలే దర్శనమిస్తున్నాయి. పోలవరం కుడి, ఎడమ కాల్వల గట్లను ఎడాపెడా తవ్వేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. కుడికాల్వ గట్లపై అనుమతి లేకున్నా, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కీలక ప్రజాప్రతినిధుల అండతో తవ్వకాలు జరుపుతున్నారు. విజయవాడ గ్రామీణ మండలం నుంచి బాపులపాడు మండలం వరకు 30 కిలో మీటర్ల మేర ప్రతి అర కిలో మీటర్‌కు ఒక రీచ్ ఏర్పాటు చేసి, 20 అడుగుల లోతు తవ్వేస్తున్నారు.
ఫిర్యాదు వెళ్తున్నా.. పట్టించుకునే వారు లేరు: నున్న ప్రాంతంలో తవ్వుతున్న మట్టి వైసీపీ నేతల అనధికారిక స్థిరాస్తి వెంచర్లకు తరలిపోతోంది. గన్నవరం పరిధిలో మైనింగ్‌పై ఫిర్యాదులు వెళ్తున్నా.. పట్టించుకునేవారు లేరు. తవ్వకాల్ని వ్యతిరేకించినందుకు జలవనరుల శాఖ అధికారులు ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేసి, అనుకూలంగా ఉండేవాళ్లను నియమించుకున్నారు. ఇటీవల YSR జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉమ్మడి కృష్ణాలో జగనన్న లేఔట్లలో చదునుచేసే పనిని కాంట్రాక్టుకు తీసుకున్నాడు. పోలవరం గట్టు మట్టిని అక్కడికి తరలిస్తానని చెప్పి, బయట అమ్మేసుకున్నారు.
150ఎకరాల్లో మీటర్ల లోతున మట్టి తవ్వకాలు: విజయవాడ శివారు కొత్తూరు తాడేపల్లిలో అనుమతుల్లేకుండా అసైన్డ్, అటవీ, పోరంబోకు భూములు 150 ఎకరాల్లో మీటర్ల లోతున మట్టి తీశారు. ఓ ఎంపీ, ఓ మంత్రి తమ బినామీలతో గ్రావెల్ తవ్వించి విజయవాడ బైపాస్ రోడ్డు నిర్మాణానికి తరలిస్తున్నారు. సీనరేజి చెల్లించడం లేదు. దీనిపై ఎన్జీటీకి ఫిర్యాదులు అందగా, సబ్‌కలెక్టర్ అదితిసింగ్ విచారణకు వెళ్లారు. గనులు, జలవనరుల శాఖల అధికారులు విచారణకు గైర్హాజరై సహకరించలేదు.
అనుమతి గోరంత.. తవ్వేది కొండంత: కొండపల్లి అభయారణ్యంలోనూ దాదాపు 100 కోట్ల విలువైన గ్రావెల్ తవ్వేశారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరంలోని కొంగర మల్లయ్య దేవస్థానం గుట్టపై 3.82 హెక్టార్లలో తవ్వకాలకు అనుమతి పొంది, కొండ మొత్తం తొలి చేశారు. 155.79 ఎకరాల విస్తీర్ణం గల కొండ వెనుక భాగం రూపు కోల్పోయింది. విస్సన్నపేట మండలం కొండపర్వలోని మల్లయ్యస్వామి గుట్టపై దేవాలయం, నవగ్రహ మండపం పక్కనే మట్టి తవ్వారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు, శలపాడు, వీఎన్‌పాలెంలో లభించే నాణ్యమైన ఎర్రమట్టికి మంచి గిరాకీ ఉంది. ఇక్కడ మట్టి మాఫియా ప్రైవేటు భూములను ఎకరం 40 లక్షల రూపాయల చొప్పున కొని మైనింగ్ చేస్తోంది. ప్రజాప్రతినిధులకు ముడుపులతో పాటు, ఆదాయంలోనూ వాటా ఇస్తోంది. 20 అడుగుల లోతుకు తవ్వేందుకు అనుమతులుండగా, 100 అడుగులకుపైగా తవ్వుతున్నారు. భారీ గోతుల్లో వర్షపు నీరు నిలిచి, పశువులు పడి చనిపోతున్నాయి.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం త్రిపురాపురం కొండ అద్దంకి-నార్కట్‌పల్లి రహదారికి సమీపంలోనే ఉండటం, అక్కడి మట్టి నాణ్యమైంది కావడంతో భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. మట్టి టిప్పర్లు నకరికల్లు తహసీల్దారు కార్యాలయం ముందునుంచే నరసరావుపేటకు వెళ్తున్నా రెవెన్యూ యంత్రాంగం అడ్డుకోవడం లేదు. సమీపంలోని బెల్లంకొండ బ్రాంచి కెనాల్ కట్టలనూ తవ్వేశారు.పెదకూరపాడు నియోజకవర్గంలోని పాటిబండ్లలో 8 ఎకరాల చెరువులో 10 అడుగుల లోతు వరకు అక్రమంగా తవ్వేశారు.
ముస్సాపురంలో 10 ఎకరాల తాగునీటి చెరువులోనూ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు గ్రామంలోని పెద్దకుంట చెరువులో అక్రమ తవ్వకాలు జరిగాయి. పుల్లడిగుంట, కుర్నూతల గ్రామాల్లోని చెరువుల్లో అనుమతులకు మించి తవ్వేశారు. బాపట్ల జిల్లా నగరం మండలం కమ్మవారిపాలెం నుంచి నిజాంపట్నం పాలరేవు వరకు 10 కిలో మీటర్ల మేర మురుగునీటి కాల్వల గట్లను యంత్రాలతో తవ్వేసి.. మట్టిని లారీల్లో రేపల్లె, పొన్నూరు, బాపట్ల, గుంటూరుకు తరలించారు.
ప్లేస్ ఏదైనా.. తవ్వడమే ముఖ్యం: విజయనగరం జిల్లాలో తోటపల్లి జలాశయం ప్రధాన కుడి కాల్వ వెంబడి 12.5 మీటర్ల ఎత్తులో మట్టికట్టలుండేవి. నేడు చాలా వరకు కొల్లగొట్టారు. గరివిడి మండలం చుక్కవలస సమీపంలో రాత్రి వేళల్లో గట్టు తవ్వేసి లారీల్లో తరలిస్తున్నారు. చీపురుపల్లి-లావేరు రోడ్డు సమీపంలో గజపతినగరం బ్రాంచి కాల్వ కట్టను 30 సెంట్ల విస్తీర్ణంలో తవ్వేశారు.
చుక్కవలస, కాపుశంభాం, కొండశంభాం పరిధిలోనూ కాల్వ గట్లు బలహీనపడ్డాయి. వేపాడ, కొత్తవలస, విజయనగరం, గజపతి నగరంలో గ్రావెల్ కనిపిస్తే చాలు.. అక్రమార్కులు తెగ తవ్వేస్తున్నారు. కాలువా, చెరువా, గెడ్డా, కొండ అని ఏమీ చూడకండా మట్టి కొల్లగొడుతున్నారు. మరి కొందరు ఏకంగా కొండలనే తవ్వేస్తున్నారు.
అక్రమార్కులు చెరువు గర్భాలను తవ్వేస్తున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో సుమారు 330 చెరువులు ఉంటే.. 290 చెరువుల్లో., ఎస్.కోట మండలం వెంకటరమణపేటలోని చెరువులను తవ్వేశారు. చీపురుపల్లి మండల పరిధిలోని తోటపల్లి ప్రధాన కాలువ, గజపతినగరం పిల్లకాలువ నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.