Illegal excavations: కొంత మంది సులభంగా డబ్బు సంపాదించాలనే దుర్భుద్ధితో అక్రమంగా తవ్వకాలు, ఖనిజ వనరుల రవాణాలకు పాల్పడుతూ అడవులను ధ్వంసం చేస్తున్నారు. మరికొందరు అత్యాశకుపోయి గుప్త నిధుల పేరుతో అదే తవ్వకాలు చేపట్టి పురాతన కట్టడాలను నాశనం చేస్తున్నారు. తాజాగా.. గుప్త నిధుల కోసం 1880లో నిర్మించిన కట్టడాలను ధ్వంసం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు అటవీ అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో తవ్వకాలను అధికారులు గుర్తించారు. గట్టుపై 7 కి.మీ. దూరంలో బెన్నీ ఐరన్ కోర్ మిల్స్ సమీపంలో దుండగులు తవ్వకాలు జరిపారు. 1880లో బ్రిటీష్ వారి హయాంలో నిర్మించిన ఐరన్ కోర్ మిల్స్ కట్టడాలను గుప్తనిధుల కోసం అక్రమార్కులు ధ్వంసం చేశారు.