Illegal Constructions in Vijayawada: విజయవాడలోని ఓ నియోజకవర్గానికి ఆయన శాసనసభ్యుడు. తన కుటుంబ సభ్యులు ముగ్గురి పేరిట గవర్నరుపేట బీసెంట్ రోడ్డు - గోపాలరెడ్డి రోడ్డుకు అనుబంధంగా ఉన్న పెద్దిబొట్లవారి వీధిలో 197.24 చ.మీ. స్థలం ఉంది. అందులో 19.31 చ.మీ. స్థలం రహదారి విస్తరణ కింద పోగా మిగిలిన స్థలంలోనే నిబంధనల మేరకు భవనం కట్టుకునే వీలుంది.
ఇక్కడ భవన నిర్మాణ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోగా, 2022 అక్టోబర్‌లో స్టిల్ట్, నేల, మొదటి, రెండు అంతస్తులను 12.45 మీటర్లలో నిర్మించేందుకు నగరపాలక సంస్థ ప్రణాళికాధికారులు అనుమతిని ఇచ్చారు. దాని ప్రకారం స్టిల్ట్ ఫ్లోర్లో సర్వెంట్ క్వార్టర్, మరుగుదొడ్డి, మెట్లు, లిఫ్టు నిర్మించుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీసు, వెయిటింగ్ హాలు, మరుగుదొడ్డి, మెట్లు, లిఫ్టు, మొదటి, రెండు అంతస్తుల్లో వ్యాయామశాలలు, మరుగుదొడ్లు, లిఫ్టు, మెట్ల నిర్మాణానికి అనువుగా ప్లాన్ మంజూరయ్యింది.
మంజూరు చేసిన ప్లాన్‌కు భిన్నంగా ప్రస్తుతం నిర్మాణం సాగుతోంది. ప్లాను ప్రకారం 4 శ్లాబులే వేయాలి కానీ అక్రమంగా రెండు అంతస్తులు అదనంగా నిర్మించారు. వాస్తవానికి 12.45 మీటర్ల మేరకే కట్టడం ఉండాలి. అయితే 6.22 మీటర్లు అదనంగా కట్టారు. పైగా దానిపై మరో అంతస్తు అక్రమంగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరహాలో నగరంలో పలుచోట్ల అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ప్లాన్‌కు భిన్నంగా మరింత ఎత్తు నిర్మించాలంటే 119 జీవో ప్రకారం బిల్డింగ్ ఏరియాలో కొంత కార్పొరేషన్కు మార్టిగేజ్ చేయాలి. రహదారి విస్తరణ కోసం.. కొంత స్థలాన్ని కార్పొరేషన్కు గిఫ్టుగా ఇవ్వాలి. ఆ నిబంధనలన్నీ ఉల్లంఘించి భవనం నిర్మిస్తుంటే అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు.