Houses and Crops Damaged : నెల్లూరు జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ, వాణిజ్య పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, పచ్చి మిర్చి, పత్తి రైతులకు అపార నష్టం వాటిల్లింది. 30 వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో పచ్చిమిర్చి, 1500 ఎకరాలలో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ, వాణిజ్య పంటల నష్టం 5 కోట్లు, ఉద్యాన పంటల నష్టం 4 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి సంయుక్త కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.
"వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. వారికి పరిహారం అందించాలి. తర్వాత పంటలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించి వారికి సహాయం చేయాలి." -రావుల వెంకయ్య, రైతు సంఘ నాయకుడు.
వర్షాలకు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని సర్వేపల్లి కట్టపై అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఐదు ఇళ్లు కూలిపోయాయి. ఇళ్ళలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. బాధితులు రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి. నిర్మాణంలో ఉన్న ఇళ్లు చాలా వరకు నెర్రలిచ్చాయి. బాధితులను టీడీపీ నేత అజీజ్ పరామర్శించారు.
"ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. వర్షాలకు ఇళ్లుగోడ కుంగిపోయింది. ఇంట్లోని సరుకులు రోడ్డుపైనే ఉంచాము. అధికారులు స్పందించి వసతి కల్పించాలని కోరుకుంటున్నాము."- సర్వేపల్లి మహిళ
"సర్వేపల్లి కాలువ రిటైనింగ్ వాల్ నిర్మాణం సిటీ వద్ద ఎందుకు ఆగిపోయింది. అదే నిర్మాణం ఇక్కడి వరకు కొనసాగితే బాగుండేది. ఇప్పుడు ఈ ఇళ్లులకు బలం ఉండేది. ఆ నిర్మాణం పూర్తైతే." - టీడీపీ నేత అజీజ్
అనంతపురం జిల్లాలో హెచ్ఎల్సీ కింద జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా రైతులు వరి పంట సాగు చేశారు. తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షం, ఈదురుగాలులు.. రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్, బొమ్మనహాల్, డి. హీరేహాల్ మండలాల్లోని వేలాది ఎకరాల్లో పంట నేల వాలింది. నూర్పిడి చేసి కలాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. ఆరబెట్టడానికి నానా అవస్థలు పడుతున్నారు. రంగు మారి మొలకలు వస్తే ధర కూడా దక్కదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.