ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిందితుల్ని ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 5లోపు విచారించాలి: హైకోర్టు - AP Latest News

AP Skill Development Institute : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల దుర్వినియోగం ఆరోపణల కేసులో నలుగురు నిందితుల్ని ఉదయం పదిన్నర సాయంత్రం 5లోపు విచారించాలని.. హైకోర్టు ఈడీని ఆదేశించింది. న్యాయవాది సమక్షంలోనే విచారణ సాగాలని స్పష్టంచేసింది. నిందితుల రిమాండ్‌ గడువు 17వ తేదీతో ముగుస్తుంటే 20వ తేదీ వరకు విశాఖ న్యాయస్థానం ఈడీ కస్టడీకి ఇవ్వడంపై తదుపరి విచారణలో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది.

High Court
High Court

By

Published : Mar 16, 2023, 9:25 AM IST

Updated : Mar 16, 2023, 9:32 AM IST

AP Skill Development Institute : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధులు దుర్వినియోగం ఆరోపణల కేసును హైకోర్టు విచారించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ నలుగురిని నిందితులను పగటి వేళ ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే విచారించాలి అది కూడా న్యాయవాది సమక్షంలోనే విచారించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులను హైకోర్టు ఆదేశించింది. రాత్రివేళలో విచారించడాన్ని ఆక్షేపించింది. ఈడీ విచారించే విధానంపై అఫిడవిట్‌ వేయాలని నిందితుల తరఫు న్యాయవాదులకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె శ్రీనివాసరెడ్డి బుధవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. కోల్‌కతాకు చెందిన సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, పుణెకి చెందిన వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్, దిల్లీకి చెందిన ముఖుల్‌ చంద్ర ఆగర్వాల్, సురేష్‌ గోయల్‌ను విచారణ నిమిత్తం ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజులు ఈడీ కస్టడీకి ఇస్తూ విశాఖ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఈనెల 13న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను సవాలు చేయడంతో పాటు రాత్రి వేళల్లో ఈడీ విచారణ జరపడాన్ని సవాలు చేస్తూ నిందితులు బుధవారం హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం వేశారు. వారి తరఫున సీనియర్‌ న్యాయవాది బి ఆదినారాయణరావు, న్యాయవాది జవ్యాజి శరత్‌ చంద్ర కోర్టుకు వాదనలు వినిపించారు.

నిందితులను ఈడీ ఈ నెల 4న విశాఖ కోర్టులో హాజరు పరచగా 17వ తారీకు వరకు రిమాండ్‌ విధించారని గుర్తు చేశారు. ఈడీ దాఖలు చేసిన ఇంకొక పిటిషన్‌పై విచారణ జరిపిన విశాఖ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు.. నిందితులను విచారించేందుకు ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనుమతి ఇచ్చిందన్నారు. రిమాండ్‌ విధించిన గడువు ఈనెల 17తో ముగుస్తుంటే 20వ తేదీ వరకు ఈడీ కస్టడీకి ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం అన్నారు. మరోవైపు నిబంధలకు విరుద్ధంగా ఈడీ అధికారులు రాత్రివేళల్లో విచారణ చేస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌ తన వాదనల కోర్టుకు వినిపించారు. నిందితులు విచారణకు సహకరించడం లేదన్నారు. దీంతో కస్టోడియల్‌ విచారణ చేస్తున్నామన్నారు. రాత్రి వేళ విచారణ ఎందుకు చేస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. లేదని సమాదానం చెప్పారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. పగటి వేళలోనే విచారణ జరపాలని ఈడీకి స్పష్టంచేశారు. నిందితుల రిమాండ్‌ గడువు 17వ తేదీతో ముగుస్తుండగా 20వ తేదీ వరకు విశాఖ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానం ఈడీ కస్టడీకి ఇవ్వడంపై తదుపరి విచారణలో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది.

Last Updated : Mar 16, 2023, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details