Court Order to Srisailam Temple EO: శ్రీశైలంలో దుకాణాల తొలగింపు వ్యవహారంలో ఈనెల 27న హైకోర్టుకు హాజరు కావాలని శ్రీశైలం దేవస్థానం ఈవోను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. శ్రీశైలంలో దుకాణాల తొలగింపుపై దుకాణ యజమానులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. లలితాంబిక కాంప్లెక్స్‌లో దుకాణాలు కేటాయించకుండా.. తమ దుకాణాలను కూల్చివేశారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికను తమ ముందు ఉంచాలని శ్రీశైలం దేవస్థానం ఈవోను ఆదేశించింది.
శ్రీశైలంలో దుకాణాల తొలగింపులో అధికారుల ముందడుగు..: శ్రీశైలంలోని ఆలయానికి ఇరువైపులా ఉన్న పాత దుకాణాల తరలింపునకు అధికారులు సిద్ధమయ్యారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం పాత దుకాణదారులకు దేవస్థాన పరిధిలోని లలితాంబికా సముదాయంలో 125 దుకాణాలను అధికారులు కేటాయించారు. కేటాయించిన దుకాణాల్లోకి వెళ్లకుండా వ్యాపారులు జాప్యం చేస్తుండడంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పాత దుకాణాలన్నింటినీ అధికారులు దగ్గరుండి ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు దేవస్థానం అధికారులు జేసీబీ సాయంతో దుకాణాల ముందు గుంతలు తీయించారు.