ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రానైట్‌ తవ్వకాల ఎన్‌వోసీ జారీ అంశంలో మంత్రి విడదలకు హైకోర్టు నోటీసులు - మంత్రి విడదల రజనికి నోటీసులు

NOTICES TO MINISTER RAJINI: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల భూముల్లో గ్రానైట్‌ మైనింగ్‌ లీజు అంశంపై.. మంత్రి రజిని, ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ, మరో ఎంపీ మోపిదేవి సతీమణి సహా పలువురికి.. హైకోర్టు నోటీసులు ఇచ్చింది. భూములు వదులుకోవాలని అధికారులు, పోలీసులు బెదిరిస్తున్నారని హైకోర్టు దృష్టికి తెచ్చిన బాధితులు.. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఎన్‌వోసీలను రద్దు చేయాలని కోరారు.

మంత్రి విడదలకు హైకోర్టు నోటీసులు
మంత్రి విడదలకు హైకోర్టు నోటీసులు

By

Published : Dec 27, 2022, 3:17 PM IST

Updated : Dec 28, 2022, 6:33 AM IST

NOTICES TO MINISTER RAJINI: పల్నాడు జిల్లా మురికిపూడి గ్రామ పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో గతంలో తమకిచ్చిన భూముల్లో ప్రస్తుతం గ్రానైట్‌ తవ్వకాలకు లీజులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని 65 మంది హైకోర్టును ఆశ్రయించారు. 90 ఎకరాల్లో 2007 - 2008 సంవత్సరాల్లో తమకు అసైన్డ్‌ భూముల పట్టాలు ఇచ్చారని.. పిటిషన్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు హైకోర్టుకు నివేదించారు. ‘బీ-ఫాం పట్టా పొందాక పిటిషనర్లు అందరు ఆ భూములను సాగు చేసుకుంటున్నారని పిటిషనర్ల న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

ముఖ్యమంత్రి జగన్‌కి సమీప బంధువు, ఎంపీ అవినాష్‌రెడ్డి మామ కావడంతో జి.వీరప్రతాప్‌రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ సతీమణికి చెందిన సంస్థలకు గ్రానైట్‌ క్వారీ లీజుకు ఇవ్వబోతున్నారని కోర్టుకు తెలిపారు. తహశీల్దార్, స్ధానిక వీఆర్‌వో పిటిషనర్లను భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని కోర్టుకు తెలిపారు. ఎస్సై సైతం పిటిషనర్లను ఠాణాకు పిలిపించి క్వారీ లీజును అడ్డుకోవద్దని, లేకపోతే కేసులు నమోదు చేస్తామని బెదిరించారన్నారు. బీ-ఫాం పట్టాలను సరెండర్‌ చేయాలంటున్నారని వాదించారు. మంత్రి రజని వద్దకు వెళ్లాలని ఎస్సై సూచించారని... ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో మంత్రి రజినిని కొంతమంది పిటిషనర్లు కలిశారన్నారు.

అభ్యంతరం చెప్పడం ఆపకపోతే మీ పట్టాలను రద్దు చేయిస్తానని మంత్రి హెచ్చరించారన్నారు. మంత్రి అనుచరులు బెదిరించారని.. పలుకుబడి ఉన్న వ్యక్తులు మైనింగ్‌ లీజుకోసం దరఖాస్తు చేయడంతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఎన్వోసీలు ఇచ్చారని వాదనలు వినిపించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని గ్రానైట్‌ మైనింగ్‌ లీజు మంజూరు చేయకుండా అడ్డుకోవాలని... వాటిని రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఆ భూముల నుంచి పిటిషనర్లలను ఖాళీ చేయించకుండా అధికారులను అడ్డుకోవాలని అభ్యర్థించారు.

పిటిషనర్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఎంపీ అవినాష్‌రెడ్డి మామ జి.వీరప్రతాప్‌రెడ్డి వ్యాపార భాగస్వామి, ఎండీగా ఉన్న వీరశివ గ్రానైట్స్, వీరభద్ర మినరల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దినేష్‌గ్రానైట్స్, జీవీ దినేష్‌రెడ్డి గ్రానైట్స్, మాజీ మంత్రి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ సతీమణి అరుణ వ్యాపార భాగస్వామిగా ఉన్న శ్రీ సుబ్రమణ్యేశ్వర మైన్స్, మినరల్స్‌కు నోటీసులు జారీచేసింది. ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, చిలకలూరిపేట గ్రామీణ ఠాణా ఎస్సై ఎస్‌.రాజేశ్, తహశీల్దార్‌ సుజాత, గనులశాఖ డైరెక్టర్, పల్నాడు జిల్లా కలెక్టర్, నరసరావుపేట ఆర్డీవో, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా.. నోటీసులు ఇచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. మైనింగ్‌ మంజూరు వ్యవహారం కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని తేల్చిచెప్పింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 28, 2022, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details