AP State Fifth Finance Commission: రాష్ట్ర ఐదో ఆర్థిక సంఘాన్ని మూడేళ్ల కాలానికి ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇందుకు సంబంధించిన జీవోను జారీచేసినట్లు కోర్టుకు వివరించింది. ఛైర్‌పర్సన్, మరో నలుగురు సభ్యుల వివరాలను ప్రభుత్వ న్యాయవాది శ్రేయాస్‌రెడ్డి మెమో రూపంలో కోర్టు ముందు ఉంచారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ రత్నకుమారిని ఛైర్మన్‌గా నియమించినట్లు మెమోలో తెలిపారు. విశాఖ ఏయూ విశ్వవిద్యాలయం విశ్రాంత రెక్టార్ ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు, విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎంవీఎన్ పద్మారావు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రకాశం జిల్లా పూర్వ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాకి కృపారావులను సభ్యులుగా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రస్తుత డైరెక్టర్, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ కేవీ రమణారెడ్డిని సభ్య కార్యదర్శిగా నియమించినట్లు వివరించారు.
ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేసిన వివరాలను ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు అందించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర స్పందిస్తూ.. కమిషన్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిన వివరాలను నమోదు చేసి వ్యాజ్యంపై విచారణను ముగించాలని కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం.. వివరాలను నమోదు చేసి విచారణను ముగించింది.