HIGH COURT ORDERS TO RAILWAY OFFICERS : విజయవాడ మధురానగర్‌లోని అప్రోచ్ రహదారి, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను సంవత్సరాల తరబడి పూర్తి చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు(GM) , విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజరు(DRM), విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌కు తేల్చి చెప్పింది. పనుల పురోగతిపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. హైకోర్టు జడ్జ్ జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
విజయవాడ మధురానగర్‌లోని అప్రోచ్ రోడ్డు, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయకపోవడంతో ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ జవ్వాజీ నారాయణ ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ నిన్న హైకోర్టులో విచారణకు హాజరయ్యారు. నిర్మాణ పనుల విషయంలో ముందుకు వెళ్లాలని రైల్వే అధికారులకు లేఖ రాసినప్పటికీ సక్రమంగా స్పందించలేదన్నారు. గుత్తేదారుకు బకాయిల చెల్లింపు విషయంలో చర్యలు తీసుకున్నామన్నారు.