High Court Comments on Chandrababu Anticipatory Bail Petition : ఉచిత ఇసుక విధానానికి సంబంధించి చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలను పాటించకుండా ఉచిత ఇసుక విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రభుత్వం ఆరోపిస్తోందన్న హైకోర్టు ఏ బిజినెస్ రూల్స్‌ను పాటించకుండా నిర్ణయం తీసుకుందో సీఐడీ కోర్టు ముందుంచిన ఆధారాల్లో లేదని తెలిపింది.
క్యాబినెట్ తీర్మానం, 2016 మార్చిలో జారీచేసిన మెమోను పరిశీలిస్తే లోతైన అధ్యయనం చేయకుండా పూర్వ పాలసీని మార్చి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారనేందుకు ప్రస్తుతానికి ప్రాథమిక ఆధారాలేవీ లేవంది. ఎంత పరిమాణంలో ఇసుకను తవ్వి తరలించొచ్చనే విషయాన్ని క్యాబినెట్ తీర్మానంలో పేర్కొనలేదని ప్రభుత్వం చెబుతోందన్న హైకోర్టు సొంత నిర్మాణ అవసరాలకు మించి ఇసుకను నిల్వ చేయడానికి వీల్లేదని తీర్మానంలో పేర్కొన్నట్లు స్పష్టమవుతోందని తెలిపింది.
ఉచిత ఇసుక కేసులో ముగిసిన వాదనలు - చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
Chandrababu Anticipatory Bail in Sand Scam Case :ఉచిత ఇసుక విధానం ముసుగులో కొందరు అనుచిత లబ్ధి పొందారని ప్రభుత్వం ఆరోపిస్తోందన్న హైకోర్టు ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థ ఆధారాలను సేకరించాలంది. ప్రభుత్వ విధాన నిర్ణయాల అమలు బాధ్యత యంత్రాంగంపై ఉంటుందని ఇసుక అక్రమ తవ్వకాలను నియంత్రించడంలో యంత్రాంగం విఫలమైతే విధాన రూపకర్తలను బాధ్యుల్ని చేయలేమంది. 2016-2019 మధ్య రాష్ట్రప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలపై వెయ్యికి పైగా కేసులు నమోదుచేసి, 40 కోట్ల జరిమానాను రాబట్టినట్లు గుర్తు చేసింది. ఈ వివరాలను చూస్తే ఇసుక అక్రమ తవ్వకాలపై అప్పటి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని తేటతెల్లమవుతోందని హైకోర్టు వెల్లడించింది.