Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున, వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆదేశించాలని.. కోరుతూ కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో 2017లో పిల్ దాఖలు చేశారు. దీని విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర తెలిపారు. తాను అడ్వకేట్ జనరల్‌గా ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి పోలవరంపై న్యాయ సలహా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాను విచారించటం భావ్యం కాదని తెలిపారు. వ్యాజ్యాన్ని మరో ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
2013-14వ సంవత్సరం నాటి అంచనా ధరల ప్రకారం మాత్రమే పోలవరం ప్రాజెక్ట్‌కు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిని రాజ్యాగం, రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ప్రకటించి, వ్యయం మొత్తం కేంద్రప్రభుత్వం భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేవీపీ గతంలో హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనల వినాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అనుబంధ పిటిషన్ వేశారు.