ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మున్నేరుకు వరద నీటి ఉద్ధృతి కొనసాగుతుంది. తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట వద్ద 10 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. కృష్ణా నదికి 17 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. మున్నేరు పరివాహక గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
తెలంగాణలో భారీ వర్షం కారణంగా ఖమ్మం జిల్లాలోని మాదారం చెరువు పూర్తిగా నీటితో నిండింది. ఈ చెరువు ఎన్నెస్పీ ఎడమ కాలువకు అనుసంధానంగా ఉండటంతో చెరువు నీటిని కాలువకు వదిలారు. ప్రస్తుతం ఆయకట్టులో సాగునీటి అవసరం లేకపోవటంతో అధికారులు జగ్గయ్యపేట మండలం గౌరవరం రెగ్యులేటర్ వద్ద తలుపులు మూసి ఎస్కేప్ ద్వారా నీటిని వాగుకు వదులుతున్నారు. వాగులో వరద నీరు పెరగటంతో పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద కల్వర్టుపై నుంచి నీళ్లు పారుతున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తిరువూరు నియోజకవర్గంలోని కట్లేరు,ఎదుళ్ల, విప్ల, పడమటి, కొండ వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరటంతో ప్రవాహ ఉద్ధృతి మరింత పెరుగుతోంది. తిరువూరు- అక్కపాలెం రహదారిలో పడమటి వాగు వంతెనపై నుంచి నాలుగు అడుగుల ఎత్తులో వర్షపు నీరు ప్రవహిస్తోంది.
తిరువూరు-జి.కొత్తూరు మార్గంలో చౌటపల్లి వద్ద ఎదుళ్ల వాగు పొంగిపొర్లుతోంది. తిరువూరు - వల్లంపట్ల మార్గంలో ఎదుళ్ల వాగు కాజ్వే పైనుంచి నీరు భారీగా పరవళ్లు తొక్కుతోంది. గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్లేరు వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెనపై నుంచి కూడా నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా ఈ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రెవెన్యూ, పోలీసు సిబ్బందితో వాగుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను మరో మార్గం గుండా మళ్లిస్తున్నారు.
ఇవీ చదవండి :