ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వ్యాప్తంగా వర్షాలు Heavy Rains in AP : వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా జిల్లాలో వాగువంకలు పొంగిపొర్లుతున్నాయి. గుడివాడ బస్టాండ్ చెరువును రోడ్లు నీటి కుంటల్ని తలపిస్తున్నాయి. పలు మండలాలకు రాకపోకలకు స్తంభించాయి. ఎడతెరిపి లేని వర్షాలకు..... కృష్ణాజిల్లా గుడివాడ జలమయమైంది. ఆర్టీసీ బస్టాండ్‌లో మోకాళ్లలోతు నీరు చేరింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పట్టణంలో అనేక రహదారులు చిన్నపాటి నీటి కుంటల్ని తలపిస్తున్నాయి. ఎటు నుంచి ఎటు వెళ్లాలో అర్థంగాక.. వాహనదారులు సర్కస్‌ఫీట్లు చేయాల్సిన దుస్థితి నెలకొంది. గుడివాడలో ఇంత దుస్థితి ఎప్పుడూ చూడలేదని.. పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నష్టపోయిన రైతులు:ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బస్టాండ్ కూడా జలమయమైంది. పట్టణంలోని రోడ్లనూ వరద ముంచెత్తింది. వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో వాగులు ఉరకలు వేస్తున్నాయి. కట్లేరు, ఎదుళ్ల, పడమటి, గుర్రపు, విప్ల వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. వేల ఎకరాల్లో మెట్ట, మాగాణి పంటలు ముంపునకు గురయ్యాయి.
ప్రజల అవస్థలు : తిరువూరు పట్టణ పరిధిలోని రాజుపేటలో నివాస గృహాలు ముంపునకు గురయ్యాయి. దీంతో కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాకపోకలకు అంతరాయం :మైలవరంలో బుడమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నారాయణ నగర్ వద్ద డొంక దారి తెగింది. పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బంది పడుతున్నారు. బుడమేరు ఇళ్లకు ఆనుకుని ప్రవహిస్తోందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వాగు ఉద్ధృతి పెరగడంతో పోలీస్ స్టేషన్ ముందు కొందరు చేపలు పట్టారు. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం, నరుకుళ్లపాడు మధ్య రాకపోకలు నిలిచాయి. హెచ్. ముత్యాలంపాడులో వంతెనపైకి వరదచేరింది. రోడ్డు తెగిపోవడంతో, జి.కొండూరు మండలం సున్నంపాడు తెల్లదేవరపాడు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇళ్లలోకి నీరు :పెనుగంచిప్రోలు నియోజకవర్గంలో మున్నేరు ఉద్ధృంతగా ప్రవహిస్తుంది. లింగాల వద్ద వంతెన నీట మునిగింది. మంగళవారం రాత్రి నుంచి ఈ రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పెనుగంచిప్రోలు వంతెన అంచును తాకుతూ వరద పారుతోంది. తిరుపతమ్మ దేవాలయ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. కేశఖండశాల, దుకాణ సముదాయం వద్ద 3 అడుగుల మేర నీరు చేరింది. తాత్కాలిక దుకాణాలు కొట్టుకుపోయాయి. తిరుపతమ్మ ఆలయం దిగువన బోస్ పేట ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది.
వాహనదారులు అసహనం :కంచికచర్లలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. కంచికచర్ల బస్టాండ్ ప్రాంతంతోపాటు వీరులపాడు వెళ్లే రహదారి గోతుల్లో నీళ్లు నిలిచాయి. రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం వల్లే ఈ దుస్థితని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మయ్య వాగు పొంగడంతో కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయి. కొద్దిపాటి వర్షం కురిసింది అంటే వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. రోడ్ల మరమ్మతులు చేసే వారు లేక ఇబ్బందులు పడుతున్నారు. కంచికచర్లలో వర్షం కురిసిందంటే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా కంచికచర్ల బస్టాండ్ ప్రాంతంలో, వీరులపాడు వెళ్లే రహదారి గుంతలమయం అవడంతో వర్షం కురిస్తే ఆ గుంతలో నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో కంచికచెర్ల నుండి తెలంగాణకు వెళ్లే రహదారి కావడంతో మరి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.