Crop Losses Due To Heavy Rains : రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు రైతుల వెన్నువిరిచాయి. రాష్ట్రంలో మొత్తం 3 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా ఉంది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నార్పల, బుక్కరాయసముద్రం, శింగనమలలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు కోట్ల రూపాయల్లోనే నష్టం వాటిల్లింది. వర్షానికి తోడు వడగళ్లు పడటం.. ఉద్యానవన, కూరగాయల పంటలను నాశనం చేశాయి. ఆముదం, మొక్కజొన్న పంటలు నామరూపాలు లేకుండా పోయాయి. తెల్లవారితే పంట కోసి మార్కెట్‌కు తరలించాల్సిన అరటి గెలలు అకాల వర్షానికి పాడైపోయాయి.
అరటి పంటను కోసి మార్కెట్‌కు తరలించే సమయానికి వర్షం దెబ్బతిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పది నెలల నుంచి సాగు చేస్తు వస్తున్న పంట.. ఒక్కసారిగా వర్షం కారణంగా నేల పాలైందని వాపోయారు. నగలు తాకట్టు పెట్టి, బ్యాంకులలో రుణాలు తీసుకువచ్చి పంట సాగు చేస్తే.. అకాల వర్షానికి పంట పూర్తిగా నాశనమైందని కన్నీటి పర్యంతమయ్యారు. లక్షల్లో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేయగా వడగళ్ల కారణంగా.. పంట నేల కూలటంతో నిరాశే మిగిలిందని రైతులు అంటున్నారు.
పల్నాడు జిల్లాలో ఉద్యానవన పంటలు దారుణంగా దెబ్బతినగా రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ఈదురుగాలుల ధాటికి మామిడి చెట్లు కూలాయి. మునగ, కంది సహా పలు పంటలూ భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఆరబెట్టిన మిర్చి తడిసింది. గాలుల తీవ్రతకు మొక్కజొన్న నేలవాలింది. కోతకు సిద్ధంగా ఉన్న మినుము వర్షార్పణమైంది. ఈపూరు మండలం బోడెపూడివారిపాలెం, నకరికల్లు, యడ్లపాడు మండలాల్లో వడగండ్ల వాన వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాజుపాలెం మండలం అంచులవారిపాలెంలో మామిడి చెట్లు వేళ్లతో సహా కూలిపోయాయి. శ్రమకోర్చి కష్టపడి పండిస్తే వర్షం వల్ల కన్నీళ్లే మిగిలాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.