ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HC On MLC Ananthbabu Driver Case: అనంతబాబు డ్రైవర్ హత్య కేసు.. పోలీసులపై హైకోర్టు ప్రశ్నల వర్షం - AP High Court judgments news

Andhra Pradesh High Court fires on police: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య కేసులో ఇతరుల ప్రమేయం ఏమేరకు ఉందో పరిశీలించి.. ఆ వివరాలను అనుబంధ అభియోగపత్రంలో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశించిన విషయాన్ని ఎందుకు విస్మరించారని మండిపడింది.

High Court
High Court

By

Published : Jul 29, 2023, 3:50 PM IST

Andhra Pradesh High Court fires on police: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇతరుల ప్రమేయం ఏమేరకు ఉందో పరిశీలించి, ఆ వివరాలను అనుబంధ అభియోగపత్రంలో పేర్కొనాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశిస్తే.. ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది.

రాష్ట్ర పోలీసులపై ధర్మాసనం ఆగ్రహం..అనంతరం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబోరేటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తున్న వ్యక్తుల పాత్ర ఏమిటో తేలుస్తూ అనుబంధ అభియోగపత్రం వేయాలని సింగిల్‌ జడ్జి ఉత్తర్వులిచ్చారని గుర్తు చేసింది. సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తోన్న వ్యక్తులు ఎవరు..? హత్యలో వారి పాత్ర ఏమిటీ..? ఒకవేళ వారికి హత్యతో సంబంధం లేదనే నిర్ధారణకు వస్తే అందుకు గల కారణాలను అనుబంధ అభియోగతపత్రంలో ఎందుకు పేర్కొనలేదు..? అని ప్రశ్నల వర్షం కురిపించింది. పై విషయాలపై పోలీసులు వివరణ ఇవ్వాలని ఆదేశాలిస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.

సుబ్రహ్మణ్యం హత్య కేసును దర్యాప్తును సీబీఐకి అప్పగించండి.. గత ఏడాది (మే 19, 2022) రాష్ట్రంలో సంచలనం రేపిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా తమ కుమారుడి హత్య వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును.. సీబీఐకి అప్పగించాలని కోరుతూ సుబ్రమణ్యం తల్లిదండ్రులు చేసిన అభ్యర్థనను హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ ఏడాది జనవరి 4వ తేదీన తోసిపుచ్చుతూ తీర్పును వెలువరించింది. దీంతో ఆ తీర్పుపై మృతుడి తల్లిదండ్రులు (వీధి నూకరత్నం, సత్యనారాయణ) హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేయగా.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యూ దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

అనంతబాబుతోపాటు ఆయన భార్య, ఇతరులు ఉన్నారు..పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ.. ''హత్య జరిగిన రోజున ఎమ్మెల్సీతోపాటు ఇతరులు కూడా ఉన్నారు. వారి భాగస్వామ్యంతోనే సుబ్రహ్మణ్యం హత్య చేయబడ్డాడు. నేర ఘటన వద్ద లభ్యమైన సీసీ టీవీ ఫుటేజ్‌లో ఎమ్మెల్సీఅనంతబాబుతో పాటు ఆయన భార్య, ఇతరులు ఉన్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక అందాక.. ఇతరుల పాత్రను నిర్ధారించి వారిపై అనుబంధ అభియోగపత్రం వేస్తామని పోలీసులు సింగిల్‌ జడ్జికి నివేదించారు. కానీ, అందుకు భిన్నంగా తాజాగా అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేస్తూ.. ఆ వివరాలేమి పేర్కొనలేదు. కేవలం అనంతబాబు పేరుతో మాత్రమే అనుబంధ అభియోగపత్రం వేశారు. నిందితుడు అధికార పార్టీకి చెందినవారు కావడంతో దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకిరావాలంటే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి.'' అని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ ధర్మాసనానికి తెలిపారు.

ఎందుకు ఆ విషయాన్ని విస్మరించారు.. న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ వాదనలను, వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సీసీ ఫుటేజ్‌ నివేదిక ఆధారంగా సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇతరుల ప్రమేయం ఏమేరకు ఉందో పరిశీలించి.. ఆ వివరాలను అనుబంధ అభియోగపత్రంలో పేర్కొనాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశించినా ఆ విషయాన్ని ఎందుకు విస్మరించారని పోలీసులను ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలని పేర్కొంటూ విచారణను వచ్చేనెల 3వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details