HC Hearing on CM Camp Office Move to Visakha Petition: ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం క్యాంప్ కార్యాలయాలను విశాఖకు తరలించడంపై దాఖలైనా పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్ట్) విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషన్‌కు విచారించే అర్హత లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. పిల్ వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్‌గా దాఖలు చేశారని, ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. దీంతో జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. అడ్వకేట్ జనరల్, పిటిషనర్ల అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
అసలు ఏం జరిగిందంటే:నవంబరు 22వ తేదీన సీఎం క్యాంప్ కార్యాలయాల తరలింపు, పరిపాలనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 2283ను విడుదల చేసింది. ఆ జీవోలో దసరా అనంతరం విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమించినట్లు పేర్కొంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీసు, బస గుర్తింపు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని, దసరా నుంచి సీఎం జగన్ విశాఖ నుంచే పరిపాలన చేయనున్నారని తెలియజేస్తూ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.