BJP MP GVL Narasimha Rao : నాలుగేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ పరిణామాలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్రం ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చినా.. వైసీపీ ప్రభుత్వం చేతకాని తనంతో నిర్లక్ష్య ధోరణిలో ఉందని అగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులకు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు సహాయం అందడం లేదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి మంచి చేసే మనసు లేదా : రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవా.. లేక ప్రజలకు మేలు చేసే మనసు లేదా అని ప్రశ్నించారు. కనీస బాధ్యత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఏపీకి 7 వేల కోట్లు అదనపు సాయం లభించినా.. అభివృద్ధి చేయడం లేదన్నారు. జగన్కు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొట్టే పరిస్థితి ఉందన్నారు. గతంలో టీడీపీని కుట్టిన పురుగే.. ఇప్పుడు వైసీపీని కుట్టినట్లు ఉంది. ప్రజా వ్యతిరేకతను కేంద్రంపై నెట్టేద్దామని చూస్తున్నారని విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్దులు అన్నట్లుగా.. టీడీపీ తరహాలో వైసీపీ దెబ్బ తినడం ఖాయమని జోస్యం చెప్పారు. వైసీపీ ఎంపీలు అబద్దాలు మాట్లాడుతూ.. వారి చేతకాని తనం బయట పెట్టుకున్నారన్నారు. వారి చేతకాని తనం వల్లే రాష్ట్రంలో ప్రాజెక్టులు నిరుపయోగంగా మారాయని ఎద్దేవా చేశారు.
ఇంతవరకు ఏం సాధించారో చెప్పే దమ్ముందా: ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు కేంద్రం ఏపీకి ఇచ్చిందని.. విశాఖతో సహా అనేక పారిశ్రామిక వాడల అభివృద్ధి వైసీపీ ఎంపీలకు పట్టదని ఆరోపించారు. రేపు సమ్మిట్లో మీ చేతకానితనం అని చెప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఉన్న ప్రాజెక్టులను కూడా తరిమేశామని చెప్పుకోగలరా అని ప్రశ్నల వర్షం కురిపించారు.. అబద్దాలను ప్రచారం చేయడం మాని.. ప్రజలకు మేలు చేయండని అన్నారు. గతాన్ని గుర్తు చేసుకోండని.. మాపై బురద జల్లితే మేము ఉపేక్షించేది లేదని జీవీఎల్ హెచ్చరించారు. 2018లో టీడీపీ ఎంపీలు ఏం మాట్లాడారో.. ప్రస్తుతం వైసీపీ ఎంపీలు కూడా అదే క్యాసెట్ వినిపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో ఏదో మాట్లాడి మార్కులు కొట్టేద్దాం అనుకుంటే ఎలా అన్నారు. ఈ ఐదేళ్లలో ఏం సాధించారో చెప్పే దమ్ము వైసీపీ ఎంపీలకు ఉందా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ.. మా నుంచి విమర్శల దాడి ఉంటుందని తెలిపారు.