GRANITE MAFIA IN AP : బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో స్టీల్‌గ్రే, బ్లాక్‌పెరల్ గ్రానైట్ విస్తారంగా లభిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉన్న సుమారు 700కుపైగా గ్రానైట్ పరిశ్రమల నుంచి సగటున రోజుకు వంద లారీలకుపైగా సరకు రవాణా అవుతోంది. ఒక్కొక్క లారీలో ఐదువేల అడుగుల గ్రానైట్ పలకలు తరలిస్తారు. అయితే ఇందులో సగానికి కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించడం లేదు. నిబంధనల ప్రకారం ఒక్కో అడుగుకు భూగర్భగనులశాఖకు 12 రూపాయలు, మొత్తం సరుకు విలువలో వస్తు సేవల పన్ను రూపేణా 18శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో లారీ నుంచి ప్రభుత్వానికి దాదాపు లక్ష రూపాయల వరకు ఆదాయం సమకూరుతుంది. రోజుకు కోటి రూపాయల వరకు ఆదాయం రావాల్సి ఉన్నా.. లక్షల్లో మాత్రమే వస్తోంది. మిగిలిన సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోంది.
ప్రభుత్వానికి చెల్లించే సొమ్ములో మూడో వంతు అంటే 30వేలు గ్రానైట్ మాఫియాకు చెల్లిస్తే చాలు.. మూడు జిల్లాల సరిహద్దులు దాటించే బాధ్యత లైన్ పర్యవేక్షించేవారు తీసుకుంటారు. ఎక్కడికక్కడ పైలట్ బృందాలను ఏర్పాటు చేసుకుని జిల్లా సరిహద్దులను దాటించేస్తున్నారు. వీరికి పోలీసు, రవాణా, భూగర్భగనుల శాఖలో కొందరు లోపాయికారీగా సహకరిస్తున్నారు. ఇక్కడి యంత్రాంగం పూర్తిగా నేతల కనుసన్నల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడి ఓ పోలీసుస్టేషన్‌లో ఏడాది బాధ్యతలు పూర్తవ్వకుండానే.. మరొకరు ఆ సీటులోకి వచ్చేందుకు పైరవీలు చేస్తారంటే అక్రమ ఆదాయం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు.
ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కీలకంగా ఉన్న నేతలు నేరుగా జోక్యం చేసుకోకుండా వారి పరిధిలో అనుచరులను నియమించుకుని వసూళ్ల బాధ్యతలను అప్పగించారు. ఇలా వసూలుచేసే మొత్తానికి ‘లైన్ మామూళ్లు’ అని పేరు పెట్టుకున్నారు. సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, మద్దిరాల వద్ద ఆయా మార్గాల్లో లైన్ మామూళ్లు వసూలవుతున్నాయి. ఆయా నేతల పరిధిలో వేర్వేరు మార్గాల్లో ఉన్న లైన్‌లో ఒక్కోచోట 7 నుంచి 8వేలు వసూలు చేస్తుంటారు. ఆయా మార్గాలనుంచి వచ్చిన లారీలన్నీ పల్నాడు జిల్లా నకరికల్లు వద్ద కలుస్తాయి.