AP Amaravati JAC Chairman Bopparaju Venkateswarlu: అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డికి... ఆ వారం ఇంకా వచ్చినట్టు లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. విజయవాడలో ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. మే 5వ తేదీన ఉప్పెన పేరుతో విశాఖలో సీపీఎస్‌పై ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాసభ నిర్వహిస్తామన్నారు. పెన్షన్ ప్రభుత్వం ఉద్యోగికి ఇచ్చే బిక్ష కాదు.. అది ఉద్యోగుల హక్కు అని బోప్పరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ లాంటి రకరకాల ప్రతిపాదనలు చేస్తున్నట్లు బొప్పరాజు పేర్కొన్నారు. తాము మాత్రం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం మినహా మరి ఏ ఇతర ప్రతిపాదనలకు అంగీకరించబోమన్నారు. జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ఉద్యమానికి ఏపీ జేఏసీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు.
జయప్రకాష్ నారాయణపై విసుర్లు.. జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యల పై బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. జెపి ఉద్యోగులు, పెన్షనర్ల నిరసనలతో రాష్ట్రం ఏమవుతుందో అనే ఆందోళనతో మాట్లాడారని బొప్పరాజు వెల్లడించారు. పాత పెన్షన్ విధానంపై జేపికి ఏమి కావాలో చెబితే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే భద్రత ఉంటుందనే నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారని వెల్లడించారు. తాము చేసే ఉద్యమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం పాల్గొంటుందని పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమానికి నిధులు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారని బొప్పరాజు వెల్లడించారు. ఉపాధ్యాయులపై మాల్‌ప్రాక్టీస్ నెపంతో ఇబ్బందిపెట్టేందుకు తీసుకువచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.