ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ ఉద్యోగులకు కొరవడిన ఆరోగ్య భద్రత - అప్పుడు అలా, ఇప్పుడు ఇలా! - వైసీపీ వర్సెస్ ఆర్టీసీ

Govt Cut in Medical Facilities to RTC Employees: ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు కనిపించడం లేదు. సంస్థలో 50 వేల మంది ఉద్యోగులు ఉంటే.. వీరిలో 45 వేల మంది వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత వీరి పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఈహెచ్​ఎస్ కార్డులతో సరైన వైద్యం అందక అష్టకష్టాలు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక కథనం.

Govt Cut in Medical Facilities to RTC Employees
Govt Cut in Medical Facilities to RTC Employees

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 3:58 PM IST

Govt Cut in Medical Facilities to RTC Employees :గుంతల రోడ్లపై వందల కిలోమీటర్ల ప్రయాణం.. రేయింబవళ్లు డ్యూటీలు.. సరైన తిండి ఉండదు, వేళకు నిద్ర ఉండదు. విధినిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగుల తీరే వేరు. అస్తవ్యస్థమైన జీవన విధానంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతారు. సంస్థలో 50 వేల మంది ఉద్యోగులు ఉంటే.. వీరిలో 45 వేల మంది వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్నారు. అందుకే వీరికి అపరిమితమై వైద్యసహాయం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. ప్రభుత్వంలో విలీనం తర్వాత వీరి పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఈహెచ్​ఎస్ కార్డులతో సరైన వైద్యం అందక అష్టకష్టాలు పడుతున్నారు.

ఆర్టీసీలో డొక్కు బస్సులు కనిపించడం లేదా జగన్‌ - 53 శాతం కాలం చెల్లిన బస్సులే?

ఆర్టీసీ బస్సులో ఒక్కరోజు ప్రయాణిస్తేనే ఒళ్లు హూనమవుతుంది. ఇక మన గుంతల రోడ్ల సంగతి సరేసరి. ఎప్పుడు గమ్యస్థానం వస్తుందా దిగిపోదామా అనుకుంటూ ఉంటాం. కానీ ఆ బస్సులో ఉండే డ్రైవర్‌, కండక్టర్‌ మాత్రం చివరి గమ్యస్థానం వరకు ప్రయాణించాల్సిందే. ఇలా రోజుకు ట్రిప్పుల మీద ట్రిప్పులు వేయాల్సిందే... ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్, కండక్టర్ సగటున రోజుకు 200 కిలోమీటర్లు, నెలకు 5వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూనే విధులు నిర్వహిస్తారు. దీంతో వీరికి ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఆర్టీసీలో 51వేల మంది ఉద్యోగులుపనిచేస్తున్నారు. వారి భిన్నమైన విధుల కారణంగా ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉంటాయి.

ప్రభుత్వంలో విలీనానికి ముందు ఆర్టీసీ ఉద్యోగులకు అపరిమిత వైద్య సేవలు అందేవి. చిన్న చిన్న సమస్యలకు ఆర్టీసీకి చెందిన డెస్పెన్సరీలో చూసేవారు. ఆ తర్వాత విజయవాడలోని ప్రధాన ఆస్పత్రి వైద్యులు సూచించే రెఫరల్‌ ప్రైవేట్ ఆస్పత్రిల్లో చికిత్స పొందేందుకు వీలుండేది. వైద్యానికి అవసరమైన మొత్తం సొమ్ము ఆర్టీసీ యాజమాన్యం ముందే చెల్లించేది. దీనికి ఎలాంటి పరిమితి లేదు. అత్యధిక మొత్తం చెల్లించాల్సి వస్తే... ఎండీ విచక్షణాధికారంతో మంజూరు చేసే వారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత... ఈ వ్యవస్థను రద్దు చేసి అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికి ఈహెచ్​ఎస్ కార్డులు అందజేశారు. వీటి ద్వారా ఉద్యోగి దంపతులు 2 లక్షల రూపాయల వరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందే వీలుకల్పించారు. అయితే ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స అందించేందుకు అంగీకరించడం లేదు. అనేక సందర్భాల్లో ఉద్యోగులే వైద్య ఖర్చులు భరించాల్సి వస్తోంది. 2 లక్షలు దాటితే మొత్తం సొమ్ము ఉద్యోగులే చెల్లించి... ఆ తర్వాత రీఎంబర్స్‌ కోసం ప్రభుత్వానికి బిల్లు పెట్టుకోవాలి. ఈ సొమ్ము కూడా ప్రభుత్వం త్వరగా చెల్లించడంలేదు. దీనివల్ల సరైన వైద్యం అందక ఉద్యోగులు కష్టాలు పడుతున్నారు.

విజయవాడ బస్ స్టేషన్‌లో డిజిటల్‌ లావాదేవీలకు స్వస్తి- ప్రయాణికులు అవస్థలు

'అవనిగడ్డ నుంచి విజయవాడకు కరకట్ట మార్గంలో 60 స్పీడ్‌ బ్రేకర్లు ఉన్నాయి. ఒక్కో సర్వీసు రోజుకు మూడేసి ట్రిప్పులు తిరుగుతాయి. అంటే ఆ మార్గంలో పనిచేసే డ్రైవర్‌, కండక్టర్ రోజుకూ 360 స్పీడ్‌ బ్రేకర్లు దాటాలి. దీంతోవారు నడుంనొప్పి, మెడనొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి సరైన వైద్యం అందించాలి. ఇటీవల నెల్లూరు జిల్లా రాపూర్ డిపోలో పనిచేస్తున్న మెకానిక్ గుంతలోపడి గాయపడ్డాడు. కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈహెచ్​ఎస్ కార్డు పనిచేయదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నూజివీడుకు చెందిన ఓ మెకానిక్ భార్య గుండె జబ్బుతో ఇబ్బందిపడ్డారు. ఈహెచ్​ఎస్ కార్డు ద్వారా చికిత్స కోసం 4 ఆస్పత్రుల్లో సంప్రదించినా వైద్యానికి నిరాకరించారు. 2 లక్షలు అప్పుచేసి చికిత్స అందించినా..అప్పటికే ఆలస్యంకావడంతో ఆమె మృతిచెందారు'-. వై. శ్రీనివాసరావు, కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి

రాష్ట్రవ్యాప్తంగా డిపోల వారీగాఆర్టీసీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా... 51 వేల మంది ఉద్యోగులకు గాను 45,310 మందికి వివిధ అనారోగ్య సమస్యల ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా 17,795 మంది డ్రైవర్లకే అధిక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో కండక్టర్లకు 14,544 మంది, మెకానిక్స్‌ 1,966 మంది ఉన్నారు. ఇటువంటి వారికి సరైన వైద్యం తప్పనిసరి. కానీ సాధారణ ఉద్యోగుల మాదిరిగానే వీరికి ఈహెచ్​ఎస్ కార్డులు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటే ఎలా అని ఆర్టీసీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. తమకు గతంలో మాదిరిగా అపరిమిత ఖర్చుతో కూడిన వైద్యసేవలు అందిచాలని కోరుతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఎస్ జవహర్​రెడ్డికి ఎన్ఎంయూఏ నేతల వినతి

ABOUT THE AUTHOR

...view details