Republic Day celebrations at Vijayawada: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఇందులో జాతీయజెండాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, హాజరయ్యారు. పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. ఆర్మీ, ఏపీఎస్పీ, ఒడిశా పోలీస్ గౌరవ వందనం చేశారు. అనంతరం గవర్నర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక వ్యవసాయం అని గవర్నర్ పేర్కొన్నారు. 10 వేలకు పైగా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. పంటకు మద్దతు ధర అందించి రైతులకు అండగా నిలబడి.. రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 సాయం చేస్తున్నామని చెప్పారు. 37 లక్షలమంది రైతులకు వైఎస్‌ఆర్ పంటలబీమా అమలు చేస్తున్నామన్నారు.
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరిగిందన్నారు. జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోందని తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు అన్ని విధాలుగా సాయపడుతున్నామని.. విద్యా కానుక ద్వారా ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సాయం అందుతోందని చెప్పారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్యాబ్లు అందించామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో త్వరలో సంచార పశువైద్య క్లినిక్‌లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో 11 బోధనా ఆస్పత్రులు నిర్మిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామన్నారు.