Examinations for School Students: పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షలను ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోతోంది. ఫార్మెటివ్, సమ్మెటివ్‌ల ప్రశ్నపత్రాలు పరీక్షలకు ముందే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం సాధారణంగా మారిపోయింది. దీంతో చాలా మంది విద్యార్థులు కేవలం ఆ ప్రశ్నపత్రంలోని వాటినే చదివేసి రాసేస్తున్నారు. విద్యాహక్కు చట్టం-2009లో భాగంగా నిరంతర, సమగ్ర మూల్యాంకన(సీసీఈ) విధానాన్ని కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీన్ని రాష్ట్రంలో 2013 నుంచి అమలు చేస్తున్నారు.
ఏడాదికి నాలుగు పర్యాయాలు ఫార్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. సీసీఈ నిబంధనల ప్రకారం వీటికి పాఠశాల స్థాయిలోనే ప్రశ్నపత్రాలను రూపొందించుకోవాలి. గతంలో ఇదే విధానాన్ని పాటించేవారు. ఇప్పుడు ఈ పరీక్షలకు సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రాన్ని అందిస్తున్నారు. గతంలో నిర్వహించిన ఈ పరీక్షల ప్రశ్నపత్రాలు ముందుగానే బయటకు వచ్చేశాయి. ఇప్పుడు నిర్వహించిన సమ్మెటివ్-1 పరీక్షల పరిస్థితి ఇలానే తయారైంది.
ఇవేం పరీక్షలు..?
రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెటివ్-1 పరీక్షలను ఈనెల 6 నుంచి 10 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ప్రతి రోజూ యూట్యూబ్, వాట్సప్‌ల్లో ముందుగానే వస్తూ ఉన్నాయి. ప్రశ్నపత్రాలు లీకవుతున్నా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. తెలుగు ప్రశ్నపత్రం లీకేజీపై విశాఖ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరవాత కూడా ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చేసినా ఏం చేయలేక అధికారులు వదిలేశారు. సాంఘిక శాస్త్రం ప్రశ్నపత్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతంలో సామాజిక మాధ్యమాల్లోకి వచ్చేసింది. గణితం పేపర్ సైతం ముందుగానే బయటకు వెలువడింది